మారికవలస గురుకులం మూసివేతపై కొనసాగిన పోరాటం
దీక్షా శిబిరం తొలగింపు
అరకు- పాడేరు రహదారిపై గిరిజనుల బైఠాయింపు
ప్రజాశక్తి - పాడేరు టౌన్ (అల్లూరి జిల్లా) : విశాఖలోని మారికవలస ఎపి గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను మూసివేస్తూ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శుక్రవారానికి మూడో రోజుకు చేరింది. గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించొద్దని డిమాండ్ చేస్తూ పాడేరు ఐటిడిఎ గేటు వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. మధ్యాహ్నం వంటావార్పు నిర్వహించిన ఆందోళనకారులు సాయంత్రం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐటిడిఎ గేటు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపిన ఆందోళనకారులు తిరిగి ఐటిడిఎకు చేరుకున్నారు. ఈ క్రమంలో తాము ఏర్పాటు చేసుకున్న టెంట్‌ను తొలగించడాన్ని నిరసిస్తూ అరకు–పాడేరు ప్రధాన రహదారిపై ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను తరలిస్తున్న వాహనానికి ముందు, వెనుక మహిళలు అడ్డుగా నిలబడి వాహనాన్ని కదలనీయలేదు. గంటకుపైగా పోలీసులు ప్రయత్నించినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో చేసేదిలేక వాహనంలోకి ఎక్కించిన ఆందోళనకారులను పోలీసులు కిందకు దింపారు. అనంతరం ఐటిడిఎ గేటు వద్దే ఆందోళన కొనసాగించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ... మారికవలస గురుకుల పాఠశాల మూసివేతపై గిరిజన మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం అల్లూరి జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారికవలస పాఠశాల అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్‌కు పిలుపునిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మారికవలస పాఠశాలకు 16 ఎకరాల స్థలం ఉందని, దానిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టకుండా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆదివాసీలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. మహిళలపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.ధర్మాన పడాల్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ... గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మారికవలస గురుకుల పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చించకుండా పాఠశాలను ఇతర రూపంలోకి మార్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ మహిళా నాయకురాలు చిన్ని, గిరిజన నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వై.కుమార్, భాను, సిహెచ్.రావు, చిన్నారావు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు రాజేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)