67.47లక్షల మందికి రూ.10,120 కోట్లు
ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లికి వందనం పథకాన్ని ఈ నెల 22వ తేదీన అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2026-27 సంవత్సరపు విధివిధానాలను వెల్లడిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం 15,16 జివోలను విడుదల చేశారు. మొత్తం 67,47,190 మంది విద్యార్ధులు, 42,70,802 మంది తల్లులు ఈ పథకానికి అర్హులుగా తేల్చినట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వీరి కోసం రూ.10,120.78 కోట్లు మంజూరు చేసింది. తొలి దశలో 64,76,590 మందికి ఈ నెల 22న నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. అనర్హుల జాబితాను కూడా 22న స్వర్ణ గ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని పేర్కొంది. వీరి నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు సచివాలయాల్లోనే స్వీకరించనుంది. వీటిని పరిశీలించి వారిలో అర్హులు ఉంటే మరో జాబితాను సిద్ధం చేయనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం 1వ తరగతిలో, ఇంటర్మీడియ ట్ తొలి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్ధులతో పాటు సరైన రికార్డులు లేకపోవడంతో హౌస్‌హోల్డ్ డేటాలోకి రాని విద్యార్ధులకు రెండో దశలో అమలు చేస్తామని వెల్లడించింది. 1వ తరగతిలో 59,500 మంది, ఇంటర్ ప్రధమ సంవత్సరంలో 56,100 మంది, హౌస్ హోల్డ్ డేటాలోకి రాని వారు 1,55,000 మంది విద్యార్ధులు ఉన్నారు. ఆగస్టు 25వ తేదితో అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని, ఆగస్టు 30వ తేదిన రెండో దశ అర్హుల జాబితాను గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించింది. ఆగస్టు 30వ తేదిన మిగిలిన 2,70,600 మంది విద్యార్ధుల తల్లులు సుమారు 1,63,300 మందికి విడుదల చేస్తామని ప్రకటించింది.
ఖాతాల్లో 13 వేలే జమ
అర్హులైన ప్రతి విద్యార్ధికి రూ.15వేలు చొప్పున రూ.10,120.78కోట్లు విడుదల చేసినా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జయ అయ్యేది రూ.13వేలు మాత్రమే. రూ.2వేలు చొప్పున కోత విధించిన నిధులను శానిటేషన్ కోసం ఉపయోగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
వీరికి జమకావు
అర్హులైన కొంతమంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమకావు. విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన విద్యార్ధులు, కేంద్రప్రభుత్వం ద్వారా ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ పొందుతున్న విద్యార్ధులకు ఆ నిధులు జమకావు.






కామెంట్‌లు (0)