11.21 లక్షల మంది అర్హత
న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 పున:పరీక్ష (రీ ఎగ్జామినేషన్) ఫలితాలను, ఫైనల్ ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) గురువారం విడుదల చేసింది. 11.21 లక్షల మంది అభ్యర్థులు ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, సంబంధిత అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక పోర్టల్‌ను సందర్శించి సమాధానాల పట్టికను చూసుకోవచ్చునని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఎన్‌టిఎ పేర్కొంది. ప్రతి ప్రశ్న సెట్ నుండి ఒక ప్రశ్నను తొలగించినట్లు తెలిపింది. సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం స్కోరు, పర్సంటైల్ స్కోరు, కేటగిరీల వారీగా ర్యాంకు, అడ్మిషన్, కౌన్సెలింగ్ కోసం స్టేటస్, ఇతర ముఖ్యమైన వివరాలను త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
మే 3న తొలుత నీట్ నిర్వహించగా, పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని 5,440 కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాలలో 20 లక్షల మందికి పైగా అభ్యర్థులకు జూన్ 21న ఈ పునఃపరీక్షను ఎన్‌టిఎ నిర్వహించింది. తాత్కాలిక జవాబు కీని జూన్ 25న విడుదల చేశారు. అభ్యంతరాలు తెలియజేయడానికి మూడు రోజుల సమయం ఇచ్చారు. విద్యార్థులు పంపిన అభ్యంతరాలపై సబ్జెక్టు ఎక్స్‌పర్టుల బృందంతో కలిసి ఎన్‌టిఎ పరిశీలించామని, అందుకు అనుగుణంగా తుది జవాబు కీని సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇక దీనిపై ఎటువంటి అభ్యంతరం తెలపడానికి వీలు లేదని పేర్కొంది.
ఫలితాలు వెలువడిన తర్వాత ఏమి చేయాలి?
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసిసి) నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా (ఎఐక్యు) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. స్టేట్ కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్రాల అధికారులు విడిగా నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగించడానికి అభ్యర్థులు ఎంసిసి అధికారిక పోర్టల్ mcc.nic.in లో నమోదు చేసుకోవాలి.
https://examinationservices.nic.in/ResultoService26/Ntnt/Login






కామెంట్‌లు (0)