గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట

1 గంట క్రితం

Rath Yatra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• ఇద్దరు మృతి

• మరో ఇద్దరి పరిస్థితి విషమం

• వందల మందికి అస్వస్థత

భువనేశ్వర్ : ఒడిశాలో గురువారం ప్రారంభమైన జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, వందలాదిమంది గాయపడ్డారు. మారిచికోట్ చౌక్ సమీపంలో జన సందోహం మధ్యలో అంబులెన్స్‌ ‌వెళ్తున్నప్పుడు ఒకరిని ఒకరు నెట్టుకోవడంతో పలువురు పడిపోయారు. క్షతగాత్రులను పూరిలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరిని అనిల్ డాష్ (35) గా గుర్తించారు, మరొకరిని ఇంకా గుర్తించాల్సి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన దాదాపు వంద మంది చికిత్స కోసం వచ్చారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చాలా మంది ప్రమాదం నుండి బయటపడినప్పటికీ, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాట సమయంలో దాదాపు 120 మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రత్యేక సహాయ యూనిట్- ఎస్‌ఆర్‌‌యు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

జోరుగా వర్షం కురుస్తున్నా లెక్కచెయకుండా దాదాపు 2లక్షల మంది పూరీకి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒడిస్సీతోపాటు వివిధ కళాకారులు చేస్తున్న సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం పూరీలో ఏకంగా 143 మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. పూరీలో వార్షిక రథ యాత్రను రాజు దివ్యసింగ్ దేవ్ 'ఛెరా పహన్‌రా' కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం వెండి పల్లకిలో ఆలయానికి చేరుకున్న రాజు రథాలపై ఆసీనులైన దేవతా విగ్రహాలకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర రథాలపై బంగారు చీపురుతో ఊడ్చే క్రతువును నిర్వహించారు. శ్రీక్షేత్ర గోవర్దన పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యులు రథాలపై ఉన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు. లక్షలాది మంది జనసందోహంతో పూరీ గ్రాండ్‌ రోడ్డు పూర్తిగా నిండిపోయింది. సాయంత్రం 4గంటలకు సందర్శకులు రథాల్ని లాగడం ప్రారంభించారు. రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవాల్సి ఉండగా, రథాలను మధ్యలోనే నిలిపివేశారు. రథాలను లాగడాన్ని శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిసింది. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, నావికాదళం, తీర గస్తీ దళాలకు చెందిన 13 వేల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రథయాత్ర సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో రూపొందించిన జగన్నాథుని సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. తొక్కిసలాటలో ఇద్దరు మరణించడంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్