- కూలి డబ్బులు అడిగిన దళిత మహిళపై దాడి
- కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కష్టపడి పనిచేసిన కూలి డబ్బులు అడిగిన దళిత వితంతు మహిళపై దాడి చేసి, కులం పేరుతో దూషించడం సిగ్గుచేటని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బాపట్ల మండలం కొండుభొట్లవారిపాలెంకు చెందిన చేబ్రోలు లక్ష్మి జీవనోపాధి కోసం ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి పచ్చాకు పొగాకు పనికి వెళ్లారని తెలిపారు. పని చేసిన కూలీ డబ్బులు ఇవ్వాలని దేవరపల్లి హరికృష్ణారెడ్డిని అడిగినందుకు తనపై ఆయన అనుచరులతో కలిసి దాడి చేసి, కులం పేరుతో దూషిస్తూ బెదిరించారని బాధితురాలు చెప్పారని పేర్కొన్నారు. గాయపడిన ఆమె ప్రస్తుతం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధితురాలి ఫిర్యాదు, అందుబాటులో ఉన్న ఆధారాలతో ఎస్‌సి,ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) చట్టంతోపాటు వర్తించే ఇతర చట్టాల కింద కేసు నమోదు చేయాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, బాధితురాలికి మెరుగైన వైద్యం, రక్షణ, న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో నిరుపేదలు, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోతుందనడానికి ఇలాంటి ఘటనలు నిదర్శనమని విమర్శించారు. కులవివక్ష, దాడులు, బెదిరింపులకు పాల్పడేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే దళిత ప్రజా సంఘాలను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.







కామెంట్‌లు (0)