- తక్షణమే సిఇసి రాజీనామా చేయాలి : వి. శ్రీనివాసరావు
- రాష్ర్టవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
ప్రజాశక్తి - యంత్రాంగం :
సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, వైసిపి, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ బిజెపి ఏజెంట్‌గా మారారని, తొలగించిన ఓట్లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. లెనిన్ సెంటర్‌లో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... గాంధీని హత్య చేసిన ఆలోచనా విధానం ఉన్నవారే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, గాంధీకి నివాళులర్పించడం అంటే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడమేనన్నారు. అమిత్ షా, మోడీ ద్వయం ఈ దేశాన్ని ఒక చెదలు పట్టిన పరిస్థితిల్లోకి తీసుకెళ్లారని, దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య స్వేచ్ఛను నాశనం చేస్తున్నారని విమర్శించారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ బిజెపి ఏజెంట్ అని డాక్యుమెంట్‌లతో రుజువైందని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'ఫారమ్ 6' పేరుతో కొత్త ఓటర్లను, యువతను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని, మన రాష్ట్రంలోనే రెండున్నర లక్షల మంది కొత్త ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బిజెపికి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దని, అలా చేస్తే బిజెపి తరహాలోనే వారి పార్టీకి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబు నాయుడికి హితవు పలికారు. వైసిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఇవిఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానం తీసుకురావాలని వైసిపి ఎంపిలు కోరినట్లు చెప్పారు. సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ... ఓటు హక్కు ప్రజాస్వామ్య హక్కని, ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని అన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపుపై పునరాలోచించాలని కోరారు. మాజీ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఓటు హక్కును పరిరక్షించాలని, ఎన్నికల కమిషనర్ల ఎంపికలో పారదర్శకత అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీలో సిపిఎం రాష్ట్ర నేతలు డి.రమాదేవి, వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, రాంభూపాల్, సిపిఐ నేతలు దుర్గ భవాని, నక్క వీరభద్రరావు, కె.వి.భాస్కరరావు, కాంగ్రెస్ నేతలు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐ(ఎంఎల్) నాయకులు జాస్తి కిశోర్ బాబు, సిపిఐ లిబరేషన్ నేత హరినాథ్, మాస్ లైన్ నాయకులు సి.భాస్కరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత రవీంద్ర, ఎంసిపిఐ(యు) నాయకులు గణేష్, మాజీ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్, జెన్‌జీ ప్రతినిధి మేఘనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో నిర్వహించిన నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. సుబ్బరావమ్మ, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, విశాఖలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, కర్నూలులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును ఖూనీ చేస్తూ, బిజెపికి తాకట్టు పెట్టడాన్ని ఖండించారు. అనకాపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం సమీపాన గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అరకులోయలో నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర పాల్గొన్నారు. నెల్లూరులో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని, ఎస్ఐఆర్ పేరుతో తొలగించిన ఓట్లను తక్షణమే ఓటరు లిస్టులలో చేర్చాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాలచెరువు వద్దనున్న దండిమార్చ్ వద్ద సత్యాగ్రహ నిరసన చేపట్టారు. మాజీ ఎంపి, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్,మాజీ ఎంపి జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో పేదలు, బడుగు బలహీన తరగతుల ప్రజల ఓట్లను దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చేపట్టిన నిరసనలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కె.సత్తిబాబు, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు బి.సిద్దు తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకూ జరిగిన ప్రదర్శనలో వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జంక్షన్ నుంచి మూడులాంతర్లు, ఎంజి రోడ్డు మీదుగా కన్యకా పరమేశ్వరి కోవెల వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో నాలుగు కాళ్ల మండపం నుంచి గోవిందరాజస్వామి ఆలయ కోనేరు, విష్ణు నివాసం, గ్రూప్ థియేటర్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది. శ్రీకాకుళం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గాంధీ విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. గుంటూరులో సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు. పల్నాడు, ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కడపలో నిరసన తెలిపారు.








కామెంట్‌లు (0)