- ఢిల్లీలో యువజన పోరుహోరు
- ఆంక్షలు, పోలీసుల నిర్బంధాలు బేఖాతరు •
- డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ భారీ ప్రదర్శన ఎంఎ బేబీ, బృందా కరత్, ఎంపి రహీం సహా పలువురు నేతల అరెస్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆంక్షలు, ఢిల్లీ పోలీసుల నిర్బంధాలను ఛేదించి యువత కదంతొక్కింది. ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది యువత భారీ ప్రదర్శన నిర్వహించారు. గాంధీ జయంతి రోజున జంతర్‌మంతర్ వేదికగా సాగిన ఈ ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లింది. నిరసనకు అనుమతి నిరాకరించిన పోలీసులు భారీగా బలగాలను మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నా యువత వెనక్కి తగ్గకుండా కదంతొక్కారు. విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించి, బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు.
డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునకు స్పందించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువత ఢిల్లీకి చేరుకున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య ఆందోళనకు నాయకత్వం వహించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్ నాయకురాలు బృందాకరత్, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్‌కుమార్, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనకు అనుమతి నిరాకరించడంతో అఖిల భారత కిసాన్ సభ కార్యాలయం నుంచి జంతర్‌మంతర్ వరకు మూడు బృందాలుగా ర్యాలీ సాగింది. మహాత్మా గాంధీ, భగత్‌సింగ్, అంబేద్కర్ చిత్రాలను చేతబూని ముందుకు సాగిన యువత పలు భాషల్లో నినాదాలు చేశారు. ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు.
ముఖంపై పిడి గుద్దులు..
యువత భారీగా తరలిరావడంతో వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఒక విద్యార్థిని ఆరెస్టు చేసి వ్యాన్‌లో ఎక్కించిన తరువాత అతనిపై ఢిల్లీ పోలీసు పిడి గుద్దులతో దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల దాడిలో డివైఎఫ్‌ఐ కేరళం రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే ఎం. విజిన్ చేయి విరిగింది. జంతర్‌మంతర్‌కి వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. ఈ మార్గంలో ఎనిమిది అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) బలగాలు మోహరించాయి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు. నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, సేవా తీర్థ్, మండీ హౌస్, లోక్ కల్యాణ్ మార్గ్ , ఐఎన్ఎ, చోర్ బజార్, రామకృష్ణ ఆశ్రం మార్గ్, న్యూఢిల్లీ తదితర 11 మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంతర్ మంతర్‌తోపాటు న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. దీంతో పాటు యాప్ బుకింగ్ ఊబర్, ఓలా, భారత్ టాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే సేవలు ఆగిపోయాయి. ఆందోళనకారులను తరలించేందుకు 70 పోలీసు బస్సులను రంగంలోకి దించారు. రెండు గంటలకు పైగా సాగిన అరెస్టుల పర్వంలో దాదాపు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అరెస్టు చేసిన నేతలు, కార్యకర్తల్లో కొంత మందిని వివిధ ప్రాంతాల్లో తిప్పుకుంటూ ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలకు తరలించారు.
అరెస్టుల మధ్యా ఆగని పోరు
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, బృందా కరత్, ఎంపి ఎఎ రహీం, హిమాగ్నరాజ్ భట్టాచార్య, డివైఎఫ్‌ఐ అఖిల భారత కోశాధికారి సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షులు వి. వసీఫ్, జైక్ సి. థామస్, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, ఐషీ ఘోష్, శిల్పా సురేంద్రన్, ఎం. విజిన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, వెంకటేష్ లను అరెస్టు చేశారు. సిపిఐ ఎంపి పి. సంతోష్ కుమార్, ఎఐఎస్‌ఎఫ్, ఎఐఎస్ఎ, ఆప్, యూత్ కాంగ్రెస్ నేతలు, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసి తరలించినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. పోలీస్ స్టేషన్‌లోనూ తమ ఆందోళనను కొనసాగించారు.
ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రశ్నార్థకం : ఎంఎ బేబీ
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై సర్వత్రా ఆందోళన నెలకొందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. యువత గొంతెత్తుతున్న సమయంలోనే దేశంలో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఎన్నికల వ్యవస్థను మలుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘంలోనే ఇద్దరు కమిషనర్లు కీలక నిర్ణయాలపై అభ్యంతరాలు నమోదు చేసిన పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆందోళన కలిగించే అంశమని బేబీ అన్నారు. ‘‘జ్ఞానేష్ కుమార్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా పదవికి రాజీనామా చేయాలి. కానీ ఆయన కొనసాగుతున్నారు. ఎంతకాలం పదవిలో కొనసాగితే అంతకాలం ఆయనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌లపై కూడా రాజకీయంగా ప్రశ్నలు మరింత తీవ్రమవుతాయి’’ అని బేబీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత, ఓటర్ల హక్కులు, స్వేచ్ఛాయుత ఎన్నికల పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని బేబీ తెలిపారు.
నాడు గాంధీ హత్య.. నేడు ప్రజాస్వామ్యం హత్య : బృందా కరత్
నాడు మహాత్మా గాంధీని హత్య చేశారని, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని సిపిఎం సీనియర్ నేత బృందా కరత్ విమర్శించారు. దేశంలో ఓట్లను దొంగిలిస్తున్నారని, ఇప్పటికి 13 కోట్ల ఓట్లను తొలగించారని అన్నారు. 2023లో మోడీ ఎన్నికల కమిషన్‌ను బిజెపి కమిషన్‌గా మార్చిన నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్‌ను కూడా వెంటనే రద్దు చేయాలని, ఓట్ల తొలగింపుకు కారణమైన సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్లందరినీ నమోదు చేయించి, ఓటు హక్కును సాధించుకుని తీరుతామని అన్నారు. యువత రోడ్లపైకి వచ్చారని, ఢిల్లీలోని ప్రతి గల్లీ జంతర్ మంతర్ లాగా మారిందని పేర్కొన్నారు.
యువత వెల్లువతో ఢిల్లీ పోలీసులు అవాక్కు
డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు నిర్వహించిన ఆందోళనతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు అవాక్కయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత ఢిల్లీకి చేరుకోవడంతో, ఆందోళనలను నివారించడానికి ఢిల్లీ పోలీసులు, ఆర్ఎఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత జరిగిన విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో, నిరసనలను అణచివేయడానికి పోలీసులు తమ నిఘా వ్యవస్థలను పటిష్టం చేసుకున్నారు. ఈ సంఘాలు పోలీసుల నిఘాకు ఏమాత్రం లొంగకుండా ఆందోళన నిర్వహించాయి. పోలీసులు అనుమతి నిరాకరించడంతో, కార్యకర్తలు జంతర్ మంతర్‌కు దూసుకెళ్లారు. అఖిల భారత కిసాన్ సభ కార్యాలయం నుంచే ప్రదర్శన ప్రారంభం కావడంతో పోలీసుల అంచనాలు తలకిందలు అయ్యాయి. ఈ ప్రదర్శనలో వేల మంది యువత, విద్యార్థులు, మహిళలు పాల్గొంటారని పోలీసులు ఏమాత్రం ఊహించలేదు. కిసాన్ సభ కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు సాగిన ప్రదర్శనను పోలీసులు నియంత్రించలేకపోయారు. నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల వద్ద కూడా నిరసన కొనసాగించారు. ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు నిరసనకారులతో నిండిపోయాయి.







కామెంట్‌లు (0)