- ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
కె.నాగభూషణ, కె.ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక పోరాట ఫలితంగానే దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం పెంపు జిఒను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగభూషణ, కె.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్మికులు జీతాల పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు తదితర డిమాండ్లకు పరిష్కారానికి 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి11వరకు17 రోజుల పాటు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీర్ఘ కాలిక సమ్మె నిర్వహించామని తెలిపారు. ఈ పోరాట ఫలితంగా నాడు మున్సిపల్ కార్మికుల జీతం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, చెత్త తరలించే వాహనాల డ్రైవర్లకు రూ.18,500 నుంచి రూ.24,500 జీతాలు పెరిగాయని పేర్కొన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం పెంపు, ప్రమాద బీమా ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంపు మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాల అమలు, పర్మినెంట్ సిబ్బందికి సరెండర్ లీవులు, డిఎ బకాయిలు చెల్లింపుకు రాతపూర్వక హామీలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు జిఓలు జారీ కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల పోరాట ఫలితంగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దహన సంస్కారాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని రూ.15 వేల నుంచి 20 వేలకు పెంచుతూ జిఒను శుక్రవారం జారీ చేసిందని తెలిపారు. ఇది మున్సిపల్ కార్మికుల పోరాట విజయమని, జిఒలు సాధించేందుకు పోరాటాల్లో పాల్గొన్న కార్మికులందరికీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ మంత్రి డాక్టర్ పి.నారాయణ , ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, సిఅండ్ డి ఎం,ఎ డాక్టర్ పి.సంపత్ కుమార్‌లకు ర్రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన హామీలకు త్వరితగతిన జిఒలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.








కామెంట్‌లు (0)