- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
- రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఎం, కెవిపిఎస్ నాయకులు
ప్రజాశక్తి - తుళ్లూరు : దొంగతనం చేశాడనే అనుమానంతో పెత్తందారులు దారుణంగా హింసించి కొట్టడంతో చనిపోయిన మేకల రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన దళితుడు మేకల రమేష్ తాపీ పని చేస్తూ 10 ఏళ్లుగా కుటుంబంతో మంగళగిరిలో ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన మంగళగిరి ప్లై ఓవర్ వద్ద ప్లాస్టిక్ ట్రేల లోడుతో ఆగి ఉన్న లారీ పక్కన నిలబడి ఉన్న రమేష్ ట్రేలను దొంగిలించాడని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పెత్తందారులైన లారీ ఓనర్, అతని కుమారుడు రమేష్ ను తీవ్రంగా హింసించి స్తంభానికి కట్టేసి కొట్టడంతో చనిపోయాడు. రమేష్ కుటుంబాన్ని సిపిఎం, కెవిపిఎస్ నాయకులు బుధవారం పరామర్శించారు. రమేష్ భార్య మేకల కల్పనకు ధైర్యం చెప్పి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ దొంగతనం నెపంతో రమేష్ ను స్తంభానికి కట్టేసి, తీవ్రంగా కొట్టి అతని మరణానికి కారణమైన పెత్తందారులపై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు చిన రమేష్ కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదన్నారు. అధికారులు ఇప్పటివరకు రమేష్ కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. రాజధానిలోని మంగళగిరి, తాడికొండ ప్రాంతాల్లో అనుమానం అనే నెపంతో ఎవరిని పడితే వారిని కొట్టడం, చంపడం సర్వ సాధారణమైన విషయంగా మారిందని, దళితులు బలహీనులు, మాట్లాడలేరని వారిని అక్రమ నిర్బంధం, చిత్రహింసలు పెట్టడం పోలీసులు, పెత్తందారులు లైసెన్స్ గా భావిస్తున్నారని శ్రీనివాసరావు మండిపడ్డారు. రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, పిల్లల చదువు బాధ్యతలు తీసుకోవాలని, తక్షణం ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రమేష్ కుటుంబానికి సిపిఎం అండగా ఉంటుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్ బాబూరావు మాట్లాడుతూ దళితుడైన రమేష్ ను పట్టపగలు అనాగరికంగా కొట్టి చంపడం చిన్న విషయం కాదన్నారు. రమేష్ మృతి చెందిన ఘటనలో మరి కొందరి పేర్లు వినబడుతున్నాయని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో దళితులకు రక్షణ లేదన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో దళితుడిని కట్టేసి కొట్టి చంపేస్తే అధికారులు, ప్రభుత్వం స్పందన సరిగా లేదన్నారు. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫారసు ప్రకారం దళితులను కొట్టడం, చంపడం జరిగితే 24 గంటల్లో కలెక్టర్, ఎస్ పి సదరు బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. రమేష్ కుటుంబాన్ని అధికారులు ఇంతవరకు పరామర్శించలేదన్నారు. రమేష్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ, రాజధాని డివిజన్ నాయకులు బి లక్ష్మణరావు, పేరం బాబురావు, షేక్ జానీ, కుంభా ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె నవీన్ ప్రకాష్, ఉపాధ్యక్షులు బూరుగ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)