- విశాఖ డైరీ చైర్మన్ పై తగు చర్యలు తీసుకోవాలి
- లీటర్ పాల ధరను పెంచాలి
- ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలి
ప్రజాశక్తి-విజయనగరం కోట: విశాఖ డైరీ పాల రైతులు విషయంలో జరుగుతున్న అన్యాయంపై హౌస్ కమిటీ తయారు చేసిన రిపోర్టును బయట పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. విజయనగరం స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన జిల్లా పాల రైతుల సంఘం ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విశాఖ అవినీతి అక్రమాలపై హౌస్ కమిటీ వేసి మూడు సంవత్సరాల కాలం గడిచిన ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా, అక్రమాలకు పాల్పడిన చైర్మన్ ఆడారు ఆనంద్ పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం అక్రమాలకు అడ్డు కాస్తుందని ఆరోపించారు. రైతులు శ్రమ కష్టంతో విశాఖ డైరీ ఆరు జిల్లాలకు విస్తరించిందని తెలిపారు. ఒక రోజుకి కోటి 65 లక్షలు ఆదాయం వస్తున్న రైతులకు కనీసం సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులపై పాలధార పెంచుతూ పోతున్నటువంటి యాజమాన్యం రైతుల పాలధార పెంచే దగ్గరికి వచ్చేటప్పుడు మీనమేశాలు లెక్కెడుతుందని అన్నారు. రైతుల దగ్గర లీటర్ పాలు 34 రూపాయలకు కొనుగోలు చేసి అదే పాలన వినియోగదారులకు 64 నుండి 780 రూపాయలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. సంవత్సరానికి 600 కోట్లు విశాఖ డైరీ కి లాభాలు వస్తున్నప్పటికీ నష్టాలను చూపించి లాభాలను తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకొని లాభం పొందుతున్నారని విమర్శించారు. పాల రైతులు సంఘంగా పరిశీలన చేస్తే 24 రకాల అక్రమాలు విశాఖ డైరీ లో జరిగాయని అన్నారు. ప్రతి సహకార డైరీ వద్ద కూడా ఆరు నుంచి పది లక్షల వరకు వసూలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అక్రమాల నుండి బయట పడటం కోసం చైర్మన్ బిజెపి పార్టీలో చేరాలని అందుకే కూటమి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విశాఖ డైరీ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించి వెంటనే చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని రైతుల పాల ధర లీటర్ పై పది రూపాయలు పెంచాలని, రైతులకు బోనస్ ఇవ్వాలని లేని యెడల భవిష్యత్తులో రైతులందరికీ కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రాంబాబు. పాల రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు గుంప రామకృష్ణ, పాల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బుద్దరాజు రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి పైడిప్పు నాయుడు, రైతు సంఘం రాష్ట్ర సభ్యురాలు గద్ద లక్ష్మి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి లంక ఆదినారాయణ తదితరులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)