రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ వేతనం కల్పించాలి
ధర్నాచౌక్‌లో కొనసాగుతున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె
ప్రజాశక్తి-కాకినాడ: వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ టీ ప్రశాంతి, కన్వీనర్ బి రాజు తదితర జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన నెల రోజుల గడువు ఈ నెల 3తో ముగిసినా చర్చలు ఫలించకపోవడంతో 4వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నామని తెలిపారు.ఈ నెల 7 నుంచి ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ తదితర అత్యవసర సేవలను కూడా బహిష్కరించి సమ్మెను ఉధృతం చేసినట్లు చెప్పారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్, హెల్త్‌కార్డులు, రిక్వెస్ట్–మ్యూచువల్ బదిలీల సౌకర్యం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి అమల్లో ఉన్న వేతన తగ్గింపును పునఃపరిశీలించాలని కోరారు. ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి సమ్మెకు ముగింపు పలకాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద మూడు రోజులపాటు సమ్మె శిబిరం నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్, పోలీసుల సూచన మేరకు గురువారం నుంచి ధర్నాచౌక్‌కు తరలించినట్లు తెలిపారు. తమ సమ్మెకు వివిధ యూనియన్లు, ప్రజా సంఘాలు, కాకినాడ బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మద్దతు ప్రకటించాయని చెప్పారు. ఐదో రోజు సమ్మె దీక్ష శిబిరాన్ని రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఎం. అజయ్‌కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, ఈసీజీ–కార్డియాలజీ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్పీచ్ థెరపిస్టులు తదితర కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)