స్టాక్‌హోమ్: సాహిత్యంలో నోబెల్ బహుమతి కెనడా రచయిత్రి అన్నీ కార్సన్‌కు లభించింది. ప్రాచీన సాహిత్య సంప్రదాయంతో సృజనాత్మకంగా సంభాషిస్తూ, సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను పరిచయం చేసినందుకు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.
1950లో టొరంటోలో జన్మించిన కార్సన్ 1990 దశకంలో పలు ప్రముఖ రచనలు చేశారు. కవిత్వం, అనువాదం, బోధన రంగాల్లోనూ ఆమె సేవలందించారు. సాహిత్యంలో పదాల మూలాలు, వాటి అర్థాలపై ఆమెకు ఉన్న ఆసక్తి ప్రత్యేక గుర్తింపు పొందింది. 1995లో వెలువడిన Glass, Irony, and Godలోని The Glass Essay ఆమె ప్రముఖ రచనల్లో ఒకటి. దీర్ఘ కవిత ద్వారా వివిధ సాహిత్య ప్రక్రియల మధ్య హద్దులను చెరిపివేసే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. 2001లో ప్రచురితమైన The Beauty of the Husband: A Fictional Essay in 29 Tangosలో వైవాహిక సంబంధంలోని సంక్లిష్టతలను వ్యంగ్యాత్మకంగా ఆవిష్కరించారు.
కార్సన్ 1981లో క్లాసిక్స్‌లో డాక్టరల్ థీసిస్ పూర్తి చేశారు. తన సాహిత్య జీవితమంతా కవిత్వ రచనతో పాటు అనువాదం, విశ్వవిద్యాలయాల్లో బోధన కొనసాగించారు. కాగా, 2025 సాహిత్య నోబెల్ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నహోర్కాయికి లభించింది.







కామెంట్‌లు (0)