ప్రజాశక్తి-యద్దనపూడి (బాపట్ల జిల్లా): డిస్లెక్సియా (అభ్యసన వైకల్యం)పై యద్దనపూడి మండల కేంద్రంలోని భవిత సెంటర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి సీహెచ్ గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ గోపి మాట్లాడుతూ.. డిస్లెక్సియా ఒక అభ్యసన వైకల్యమని తెలిపారు. దీనివల్ల కొంతమంది పిల్లలు చదవడం, రాయడం, మాట్లాడడం, పదాలు లేదా అక్షరాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. పిల్లల మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంలో ఉండే తేడా తప్ప, వారిలో మరే లోపం లేదని పేర్కొన్నారు. డిస్లెక్సియా ఉన్న పిల్లలకు కూడా నేర్చుకోవాలనే ఆసక్తి, సామర్థ్యం ఉంటాయని, వారి అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు.
సమగ్ర శిక్ష ద్వారా అందించే సౌకర్యాలు, సదుపాయాలను అర్హులైన పిల్లలు సకాలంలో వినియోగించుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దేవేంద్రనాథ్, సమగ్ర విద్యా ఉపాధ్యాయులు కత్తి సురేఖ, బొడ్డు చంద్రశేఖర్, ఎం. శ్యాంప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)