మూడో రోజుకు చేరిన ‘ఇండియా’ కూటమి నిరసనలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం కూడా విపక్ష ఎంపీలు ఢిల్లీలో ఆందోళన కొనసాగించారు. నిరసనల్లో భాగంగా విపక్ష ఎంపీలు తొలుత రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్‌లకు శిక్ష తప్పదని, ఇది తన హామీ అని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం తమను అడ్డుకుంటోందని విమర్శించారు. మొదటి రోజు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా, మరుసటి రోజు జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. తమ ఎంపీలపై దాడులు జరిగాయని ఆరోపించారు.
రేపు రాష్ట్రపతితో భేటీ
ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలపై తదుపరి కార్యాచరణకు ‘ఇండియా’ కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం విపక్ష ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకున్న నేతలు.. ఎన్నికల సంఘంపై తమ ఆరోపణలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించనున్నారు.







కామెంట్‌లు (0)