- రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల మందికి ఉద్యోగాలు
- టిసిఎస్ ప్రతినిధులతో తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి సమావేశం
ప్రజాశక్తి హైదరాబాద్ బ్యూరో : దేశంలోనే అతిపెద్ద ఎఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టిసిఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టిసిఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఆ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఎఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఎఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఎఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని అన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టిసిఎస్ ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రైజింగ్ విజన్-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని అభివర్ణించారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఎఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. టిసిఎస్ సిఇవొ కె కృతివాసన్, సిఒఒ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, హైపర్ వాల్ట్ సిఇఒ, ఎండి దీపేష్ నందా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఎఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు సమావేశంలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)