-ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు పెద్ద కుట్ర
-అర్హతను ఓటరే నిరూపించుకోవాల్సిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు
-ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే శక్తులు బలపడుతోన్న ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకునేందుకు ప్రజలతో కూడిన ఒక బలమైన సైన్యం తయారు కావాల్సిన అవసరముందని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజలమైన మనం (వి ద పీపుల్ ఆఫ్ ఇండియా) సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలోని నాస్తిక కేంద్రం (డాక్టర్ సమరం హాస్పిటల్)లో తెలుగు రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డివివిఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్ ‘దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలు–పౌర సమాజం కర్తవ్యాలు’ అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. గతంలో ఐరోపా దేశాల్లో మైనార్టీలు ఎదుర్కొన్న పరిస్థితులను పరకాల ప్రభాకర్ వివరించారు. అలాంటి పరిస్థితులను భారతదేశంలోనూ తీసుకువచ్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను, సంస్కృతిని, జాతిని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. మతం, కులం, భాష, ప్రాంతం, లింగం, రంగు వంటి ఏ విధమైన భేదాలు లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ రాజకీయ సమాజంలో సమాన భాగస్వాములయ్యే పరిస్థితి రావాలని, అందుకోసం ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎస్‌ఐఆర్ పేరుతో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందని విమర్శించారు. ఓట్ల తొలగింపులో ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, నిరుపేదలు, రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే వర్గాలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆరోపించారు. జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉండగా, లక్షల సంఖ్యలో ఓట్లు తగ్గిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఇది పెద్ద కుట్రగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. లక్షల సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎందుకు ప్రశ్నించడం లేదంటే, చాలామందికి తమ ఓటు తొలగించబడిన విషయమే తెలియడం లేదని అన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించలేదని అధికారులు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అర్హుడా, కాదా అనేది ఓటరే నిరూపించుకోవాల్సిన పరిస్థితిని తీసుకురావడం గతంలో ఎన్నడూ లేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులపై ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరిచే ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘భారతదేశ ప్రజలమైన మనం’ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సంస్థ లక్ష్యాలు, భవిష్యత్ కార్యకలాపాలపై సమావేశంలో చర్చించారు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. పలు అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగ పీఠికను చేర్చాలని, వందేమాతరం అంశంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని, వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను నిరోధించాలని తీర్మానాల్లో డిమాండ్ చేశారు. ఈ ఏడాది మేలో భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ‘బొద్దింక’ వ్యాఖ్యలపై నిరుద్యోగ యువతలో వ్యక్తమైన ఆగ్రహాన్ని తీర్మానంలో ప్రస్తావించారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపు రాజ్యాంగ విరుద్ధమనే అంశాన్ని తీర్మానంలో చేర్చారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం, సంస్థ వ్యవస్థాపకులు కటారి శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాస్, మనోరమ, చుండూరి రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ జడ్జి ఎ.లక్ష్మి, రామమోహన్ రావు, రవి మారుత్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)