బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనమా? జిందాల్‌ కంపెనీనా?

1 గంట క్రితం

jindal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రభుత్వం తేల్చుకోవాలి

- ప్రైవేట్‌ ‌కంపెనీకి ఐరన్‌ ఓర్‌ ‌కట్టబెట్టడంపై తీవ్ర వ్యతిరేకత

- జిఒకు వ్యతిరేకంగా ఐదు గ్రామాల ప్రజలు దీక్షలు

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : ప్రకాశం జిల్లా టంగుటూరు, ఒంగోలు రూరల్‌ ‌మండలం యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, మర్లపాడు, కొణిజేడు, కందులూరు పరిధిలోని ఐరన్‌ ఓర్‌‌ తవ్వకాలను ప్రభుత్వం జిందాల్‌ ‌కంపెనీకి అనుమతి ఇవ్వడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఐదు గ్రామాల రైతులు బుధవారం నుంచి మళ్లీ దీక్షలకు దిగారు. జిందాల్‌కు ఇనుప నిక్షేపాలు అప్పగిస్తే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం అన్నీ కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్‌ ‌కంపెనీని అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. వీరి పోరాటానికి వైసిపి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సిపిఎం నేతలు మోజెస్‌, రాము, ఇతర పార్టీల నేతలు మద్దతు తెలిపారు. గతంలోనూ ఇక్కడి ఐరన్‌ ఓర్‌ ‌తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయి. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పట్లో పాలకులు వెనక్కి తగ్గారు. ఇక్కడ ఖనిజ తవ్వకాలకు టిడిపి కూటమి ప్రభుత్వం తాజాగా జిఒ ఇవ్వడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

పాతికేళ్లుగా వివాదం

ఇక్కడి ఐరన్‌ఓర్‌ను తరలించాలనే ప్రయత్నాలు గత 25 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడి అప్పటి నుంచి అడ్డుకుంటూ వస్తున్నారు. 2001లో అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మైనింగు అధికారులతో ఇక్కడ పరిశోధనలు చేయించారు. ఇనుప నిక్షేపాలున్నట్లు తేలింది. వీటిని విశాఖ ఉక్కు పరిశ్రమ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఏదో రకంగా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలనే ఆలోచన చేశారు. అప్పట్లో ఓబులాపురం గనుల వ్యవహారం పెద్ద చర్చగా మారింది. మైనింగు మాఫియా ఎలా కోరలు చాస్తుందో జనానికి అర్థమైంది. దీంతో, ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ ఐదు గ్రామాల పరిధిలో తవ్వకాల కోసం 2013లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్‌, ఇతర అధికారులు వెళ్లగా, కలెక్టర్‌‌ కారును ప్రజలు అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా రైతులను, ప్రజలను పక్కకు తోసేసి కలెక్టర్‌‌ను, ఇతర అధికారులను గ్రామం నుంచి బయటకు తరలించారు. కాలుష్యంతో వ్యవసాయం పోతుందని, గ్రామాల్లో మైనింగు వాహనాలతో ఇబ్బందులు పడతామని ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, ప్రభుత్వం అప్పట్లో వెనక్కి తగ్గింది. ఈ కొండలను చదును చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గత వైసిపి ప్రభుత్వం సుమారు రూ.22 కోట్లు కేటాయించింది. చదును చేసి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు రాళ్లు కూడా పాతారు. రాజకీయ కారణాలతో కొందరు కోర్టులను ఆశ్రయించడంతో ఇంటి స్థలాలకు ఇవ్వడం ఆపేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడి ఇనుప ఖనిజంపై జిందాల్‌ ‌కంపెనీ కన్నుపడింది. ప్రభుత్వ పెద్దల స్థాయిలో జరిగిన మంతనాలతో రాత్రికి రాత్రే జిందాల్‌ ‌కంపెనీకి అప్పగిస్తూ జిఒ జారీ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఈ ఐదు గ్రామాల ప్రజలు మళ్లీ ఆందోళన బాటపట్టారు. జనమా? జిందాల్‌ కంపెనీనా? అనేది ప్రభుత్వం తేల్చుకోవాలని, ఇచ్చిన జిఒను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్