- సమాచారం లేని వాదనలనే వ్యతిరేకిస్తుంది
- ఎన్‌సిఆర్‌టి పాఠ్యాంశాలపై కేసు ముగిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంటూ ఏకంగా ఒక పాఠ్యాంశాన్ని చేర్చి వివాదాలు మూటగట్టుకున్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో సదరు పాఠ్యాంశాన్ని ఎన్‌సిఇఆర్‌టి తొలగించి కొత్త పుస్తకాలను ముద్రించాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై విచారణను ముగిస్తూ బుధవారం నాడు భారత ప్రధానన్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శలను న్యాయవ్యవస్థ వ్యతిరేకించదని స్పష్టం చేసింది. కానీ సమాచారం లేని వాదనలను వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే న్యాయవ్యవస్థపై విమర్శలను సరైన వేదిక ద్వారా నిష్పక్షపాతంగా, హేతుబద్ధమైన పద్ధతిలో వ్యక్తం చేయాలని హెచ్చరించింది. విమర్శకు, మౌనానికి మధ్య తేడా లేదని పేర్కొంది. బాధ్యతాయుతమైన చర్చకు, సమాచారం లేని వాదనకు మధ్యే తేడా ఉందని అభిప్రాయపడింది.
అసలేంటి వివాదం?
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 8వ తరగతి సాంఘిక శాస్ర్తం పుస్తకంలోని అధ్యాయం 4లో 'ది రోల్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇన్ సొసైటీ (సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర)' అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, కేసుల పెండింగ్, మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలు ఉండటంతో వివాదం మొదలైంది. ఈ అధ్యాయం న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపైనే సుప్రీం కోర్టు సుమోటాగా విచారణ చేపట్టి ఎన్‌సిఆర్‌టిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం సాంఘిక శాస్త్రం పుస్తకానికి సంబంధించిన ముద్రణ పూర్తైన, అలాగే డిజిటల్ కాపీలన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆ పుస్తకాన్ని మళ్లీ ముద్రించడం, డిజిటల్ రూపంలో ప్రచురించడం లేదా పంపిణీ చేయడంపై పూర్తి నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్‌సిఇఆర్‌టిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎన్‌సిఇఆర్‌టి సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు కూడా చెప్పింది. అనంతరం ఎన్‌సిఇఆర్‌టి సాంఘిక శాస్ర్తం పుస్తకానికి పలు మార్పులు చేసింది. 'స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం?' అనే ప్రారంభ ప్రశ్నను తొలగించి 'న్యాయబద్ధమైన, సామరస్యపూర్వకమైన సమాజం కోసం అసలు న్యాయం ఎందుకు అవసరం? అనే కోణంలో కొత్త అంశాన్ని చేర్చింది. కొత్త అధ్యాయంతో కూడిన కొత్త ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాన్ని విద్యార్థులకు పంపిణీ చేశారని సెప్టెంబరు 1న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్‌సిఇఆర్‌టి పుస్తక వివాదం సివిల్ సుమోటో రిట్ పిటిషన్‌ను మూసివేసింది.








కామెంట్‌లు (0)