- విద్యార్థుల మృతికి బిజెపి బాధ్యత వహించాలని డిమాండ్
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) ప్రధాన కార్యాలయం ముందు సిపిఎం బుధవారం ఆందోళనను నిర్వహించింది. ఈ నెల 6న సత్య నికేతన్ భవనం కుప్పకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనకు బిజెపి ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ముందుగా రంజిత్ ఫ్లైఓవర్ నుంచి ఢిల్లీ సివిక్ సెంటర్‌లోని ఎంసిడి ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీని సిపిఎం నిర్వహించింది. తరువాత కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా నేతృత్వం వహించగా, ఎంపి శివదాసన్, వీరేంద్ర గౌర్, హీరాలాల్, మైమూనా మొల్లా, అమన్ సైనీ, రాజీవ్ కున్వార్, సుబీర్ బెనర్జీ తదితరులు మాట్లాడారు. ఢిల్లీ వ్యాప్తంగా విస్తరించిన అక్రమ నిర్మాణాలు, విద్యార్థులకు హాస్టళ్ల తీవ్ర కొరత, విద్యా నిధుల్లో ప్రభుత్వం కోతలు, ఎంసిడి పర్యవేక్షణ-అమల్లో వైఫల్యం.. మొదలైన వాటితోనే సత్య నికేతన్ విషాదం జరిగిందని వారు విమర్శించారు. కేవలం కొంత మంది అధికారులను సస్పెండ్ చేసి బిజెపి ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. కేంద్రం, ఢిల్లీ, ఎంసిడి అన్నీ బిజెపి ప్రభుత్వ పాలనలో ఉన్నాయని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులకు సురక్షితమైన వసతి ఎందుకు కల్పించలేదో, అక్రమ నిర్మాణాలపై ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదో బిజెపి 'ట్రిపుల్-ఇంజిన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)