శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలి

15 గంటల క్రితం

ongole
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మిగిలిన ఎఫ్‌సివి సరుకును అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేయాలి

- పొగాకు బోర్డు ఇడికి ఎస్‌‌కెఎం నాయకుల వినతి

ప్రజాశక్తి– ఒంగోలు సిటీ : ఎఫ్‌సివి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకాశం జిల్లా నాయకులు శుక్రవారం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు విశ్వశ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. గత మూడు సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుతం సుమారు 30 శాతం తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను విక్రయించుకోవాల్సి వస్తోందని ఇడి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వద్ద మిగిలిపోయిన ఎఫ్‌సివి పొగాకును ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తక్కువ ధరల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతులపై మిగిలిన సరుకు విషయంలో అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌సివి పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఆర్థికసాయం మధ్యవర్తులు, ఇతరుల ప్రమేయం లేకుండా అసలైన సాగుదారులను గుర్తించి నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పొగాకు ధరలు తగ్గడం, ఉత్పత్తుల విక్రయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌కెఎం ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు వడ్డె హనుమారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం నాయకులు పరిటాల కోటేశ్వరరావు, ఎపి రైతు సంఘ నాయకులు పొందూరు సింగయ్య, కనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్