గ్రామ, వార్డు సభలలో ఓటర్ల లిస్టును ప్రకటించి అవగాహన కల్పించాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సర్ ప్రక్రియ గడువు పొడిగించాలని, గ్రామ, వార్డు సభల్లో ఓటర్ల లిస్టును ప్రకటించి అవగాహన కల్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. రెండు రోజులపాటు విజయవాడలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. దీనికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, యు వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల ప్రత్యేక సవరణపై ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గడువును కనీసం మరో నెల అప్లికేషన్లు అందించడానికి సమయాన్ని పొడిగించాలని రాష్ట్ర కమిటీ కోరింది. ఓటర్లకు తగిన అవగాహన లేకపోవడం, అవసరమైన పత్రాలను సమర్పించడానికి తగిన సమయం లేకపోవడం, దూర ప్రాంతాలు, వృద్ధులు, వికలాంగులు, పేదలు, వలస కార్మికులు వంటి తరగతులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. దీనివల్ల అర్హులైన ఓటర్లు ఓటరు జాబితా నుండి తొలగిపోయే ప్రమాదం ఉందని, బిఎల్‌ఒలు వారికి కేటాయించిన కుటుంబాలను కలిసి అప్లికేషన్ ఫారం అందించడం కూడా ఇంతవరకు పూర్తి కాలేదని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు రాజ్యాంగబద్ధమైన అత్యంత విలువైన హక్కు అని, ఈ హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకోవాలని, దానికోసం ప్రతి గ్రామం/ వార్డు/ బూత్ స్థాయిలో సభలు పెట్టి అవగాహన కల్పించాలని సూచించింది. మ్యాపింగ్ చేసిన లిస్టులను బహిరంగంగా ప్రకటించాలని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఆచరణలో వస్తున్న సమస్యలను గుర్తించి ప్రజలందరికీ అవకాశం కల్పించేలా గడువును పొడిగించాలని, ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ఓటు వివరాలను ప్రకటించాలని తెలిపింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, బూత్ స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, వలస కార్మికులు తదితరులకు ప్రత్యేక సహాయం అందించాలని కోరింది. అత్తగారి కుటుంబానికి వచ్చే వివాహిత మహిళల సమస్యలను పరిష్కరించడానికి సరైన సూచనలివ్వాలని, సరైన విచారణ, నోటీసు ఇవ్వకుండా ఏ ఓటరునూ జాబితా నుండి తొలగించరాదని కోరింది. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా, పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని సూచించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పై డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానంలో కోరింది.








కామెంట్‌లు (0)