బెంగళూరు : పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన తాజా యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ నేడు విడుదలైంది. మొదటి రోజే సామాజిక మాధ్యమాల్లో సినిమాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తీవ్రంగా స్పందించింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమాకు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించేలా తప్పుడు కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ‘ఎక్స్’ (ట్విట్టర్)తో పాటు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న అపరిచిత వ్యక్తులపై కోర్టు ఈ ఆంక్షలు విధించింది. సినిమా ప్రతిష్టను కించపరిచేలా ఏ మీడియాలోనూ ఎలాంటి అంశాలను పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం చేయకూడదని తేల్చిచెప్పింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు కేసు తదుపరి విచారణ జరిగే రోజు అయిన సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను దుర్వినియోగం చేయకూడదని, కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ రక్షణ ఉత్తర్వులను రద్దు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)