మాస్కో : ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దేశీయ చమురు శుద్ధి సామర్థ్యం దెబ్బతినడంతో రష్యా ఆగస్టులో రికార్డు స్థాయిలో 1.72 లక్షల టన్నుల చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. గత నెలవారీ రికార్డుతో పోలిస్తే ఈ దిగుమతులు ఏడు రెట్లకుపైగా పెరిగాయి. 2025లో మొత్తం దిగుమతి చేసుకున్న పరిమాణానికి మూడు రెట్లు అధికంగా ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్‌ఇఎ) తన నెలవారీ నివేదికలో తెలిపింది. రష్యా ఆగస్టులో దిగుమతి చేసుకున్న చమురు ఉత్పత్తుల్లో భారత్ వాటా 70 శాతంగా ఉంది. భారత్ నుంచి 1.20 లక్షల టన్నుల పెట్రోల్ సరఫరా కాగా, దాని విలువ 78 మిలియన్ యూరోలు. భారత్‌లోని వడినార్ రిఫైనరీలో రష్యా ముడిచమురుతో ఈ పెట్రోల్‌ను శుద్ధి చేశారు. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ సంస్థకు నయారా ఎనర్జీలో 49.13 శాతం వాటా ఉంది. వడినార్ రిఫైనరీలో తయారైన మొత్తం పెట్రోల్‌ను నయారా ఎనర్జీ రోస్‌నెఫ్ట్‌కు విక్రయించినట్లు సిఆర్‌ఇఎ తెలిపింది. 2026లో తొలి ఎనిమిది నెలల్లో వడినార్ రిఫైనరీ ఉపయోగించిన ముడిచమురు మొత్తం రష్యా నుంచే వచ్చినట్లు నివేదిక పేర్కొంది. రష్యా దేశీయంగా ఉత్పత్తి చేయలేని ఇంధనాన్ని తనకు పాక్షిక యాజమాన్యం ఉన్న రిఫైనరీ ద్వారా తయారు చేయించుకుని, తిరిగి దిగుమతి చేసుకుంటోందని సిఆర్‌ఇఎ వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలో ఇంధన ఉత్పత్తి తగ్గి కొరతలు ఏర్పడుతున్నాయని తెలిపింది.
వడినార్ నుంచి రష్యాకు తరలించిన ప్రతి పెట్రోల్ సరుకును ఈజిప్టు సమీప సముద్ర జలాల్లో ఒక నౌక నుంచి మరో నౌకకు బదిలీ చేసి, రష్యాలోని బెలోయే మోరే రేవులో దించారు. ఈ రవాణాలో పాల్గొన్న నౌకలన్నీ ఆంక్షలు ఎదుర్కొంటున్న ట్యాంకర్లేనని, వాటిలో నాలుగు గతంలో తప్పుడు జెండాలతో నడిచినవని సిఆర్‌ఇఎ పేర్కొంది. ఆగస్టులో రష్యా మొత్తం చమురు ఉత్పత్తుల దిగుమతుల్లో పెట్రోల్ వాటా 74 శాతానికి చేరింది. దక్షిణ కొరియా 18 వేల టన్నుల చమురు ఉత్పత్తులను, ప్రధానంగా గ్యాస్‌ఆయిల్‌ను సరఫరా చేసింది. ఈజిప్టు 25 వేల టన్నుల డీజిల్‌ను 16 మిలియన్ యూరోల విలువతో ఎగుమతి చేసింది.







కామెంట్‌లు (0)