శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిపిపి విధానంలో తిరుపతి విమానాశ్రయం

6 గంటల క్రితం

tirupati air port
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 50 ఏళ్లు లీజుకు

  • అదాని, జిఎంఆర్ తో పాటు విదేశీ సంస్థలూ ఆసక్తి

  • నష్టాల ముసుగులో 'ప్రైవేట్` పరం

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు కీలకమైన తిరుపతి విమానాశ్రయం ఇకపై ప్రైవేటు నిర్వహణలోకి వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నిర్వహిస్తున్న 11 విమానాశ్రయాలను ఐదు బండిళ్లుగా విభజించి ప్రైవేటు సంస్థలకు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) విధానంలో అప్పగించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందులో తిరుపతి–తిరుచిరాపల్లి విమానాశ్రయాలు ఒకే బండిల్‌గా ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పిపిపిఎసి) ఆగస్టు నాలుగు నాటి సమావేశంలో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా 11 విమానాశ్రయాలకు ప్రైవేటు సంస్థల నుంచి సుమారు రూ.8,622 కోట్ల పెట్టుబడి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే తిరుపతి–తిరుచిరాపల్లి బండిల్‌కు ప్రత్యేకంగా ఎంత పెట్టుబడి పెట్టాలన్నది ఇంకా ఖరారు కాలేదు. ఎయిర్ పోర్టు అథారిటీ గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9,95,640 మంది ప్రయాణికులు తిరుపతి విమానాశ్రయాన్ని వినియోగించారు. అదే కాలంలో 12,043 విమానాల రాకపోకలు నమోదయ్యాయి. ప్రయాణికుల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 14.4 శాతం పెరిగింది._తిరుమలకు వచ్చే దేశీయ, అంతర్జాతీయ యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత పదేళ్లలో రూ.364 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రస్తుతం తిరుపతి ఎయిర్‌‌పోర్టు రన్‌ ‌వే 2,450 మీటర్లు. దీన్ని 3,850 మీటర్లకు పెంచేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, కారు చౌకగా ప్రైవేట్ పరం చేస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు.

50 ఏళ్లకు ప్రైవేటు సంస్థ చేతికి !

తిరుపతి విమానాశ్రయాన్ని కేవలం నిర్వహణకే కాకుండా ఆపరేషన్, మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ బాధ్యతలతో ప్రైవేటు కన్వెన్షన్ ఎయిర్ కు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ కన్వెన్షన్ కాలం 50 సంవత్సరాలు. పిపిపిఎసి నుంచి సూత్రప్రాయ ఆమోదం వచ్చినప్పటికీ తుది ఆమోదాలు, టెండర్, బిడ్డింగ్, విజేత ఎంపిక వంటి ప్రక్రియలు ఉన్నాయి._ఇప్పటి వరకు తిరుపతి విమానాశ్రయం బిడ్డింగ్‌పై ఆసక్తి చూపుతున్న సంస్థల్లో ప్రముఖ ప్రైవేటు ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లయిన అదాని గ్రూప్, జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఫ్రాన్స్‌కు చెందిన విన్సీ ఎయిర్‌పోర్ట్స్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) పేర్లు వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని అంతర్జాతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అదాని, జిఎంఆర్ తదితర సంస్థలు_ బిడ్డర్లుగా మాత్రమే ఉన్నాయి.

ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి : వందవాసి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి

తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. విమానాశ్రయం కోసం గతంలో దళితులు, బడుగు బలహీన తరగతుల నుంచి భూములు తీసుకున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న భూములను కారుచౌకగా ప్రైవేట్‌ ‌పరం చేయడం అన్యాయం. విమానాశ్రయాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్