శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలి

4 గంటల క్రితం

atchannaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి కె.అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ‌ర్జినీయా పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు టోబాకో బోర్డుకు సూచించారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై మంత్రి టెలికాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు య‌శ్వంత్ కుమార్, టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. విశ్వ‌శ్రీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ స‌మూన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లు, రైతులకు లభిస్తున్న ధరలు, మార్కెట్ పరిస్థితులు, కొనుగోళ్ల వేగవంతంపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా ఊపందుకున్నాయని, ప్రస్తుతం రోజుకు సుమారు 8.5 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠంగా కిలోకు రూ.250 వరకు ధర లభిస్తోందని, రైతులకు మరింత మెరుగైన ధర వచ్చేలా కొనుగోలు సంస్థలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. ముఖ్యంగా, పొగాకు కొనుగోలు సంస్థలపై సమర్థవంతమైన ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు ఇంకా అధిక ధర లభించేలా చర్యలు చేపట్టాలని టొబాకో బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సూచించారు. కొనుగోళ్లు మరింత వేగవంతం కావడం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే, తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో ప్రత్యేకంగా చర్చలు జరపాలని టొబాకో బోర్డు అధికారులకు ఆదేశించారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని 2026-27 సీజన్‌లో ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేసే దిశగా వ్య‌వ‌సాయ శాఖ‌, టోబాకో బోర్డుతో స‌మ‌న్వ‌యం చేసుకుని రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్