ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒక్క క్లిక్‌తో.. చరిత్ర నిక్ష‍ిప్తం..

1 గంట క్రితం

click
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 07:29 పూర్వాహ్నం | 13 నిమిషాల చదవడం

క్షణం కనుమరుగవుతుంది...

ఛాయాచిత్రం శాశ్వతమవుతుంది...

కెమెరా క్లిక్‌ ఒక జ్ఞాపకాన్ని మాత్రమే కాదు,

ఒక యుగాన్ని కూడా సజీవంగా నిలుపుతుంది.

ఆగస్టు 19న ప్రపంచ ఫొట్రోగ్రఫీ దినోత్సవం గా జరుపుకుంటారు. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం లూయిస్‌ డాగురే రూపొందించిన డాగ్యు రేటైప్‌ ఛాయాచిత్ర ప్రక్రియను ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా 2026లో 187వ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఫొటోగ్రఫీ కళ, శ్రాస్తం, చరిత్ర, సామాజిక ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తుచేసుకునే సందర్భంగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీనిపైనే అట్టమీది కథ.


‘‘వెయ్యి మాటలు చెప్పలేనిది ఒక చిత్రం చెబుతుంది’’ అనే నానుడి ఫొటోగ్రఫీ విశిష్టతను తెలియజేస్తుంది. కాలం గడిచిపోతుంది. మనుషులు మారిపోతారు. నాగరికతలు రూపాంతరం చెందుతాయి. కానీ ఒక ఛాయాచిత్రం మాత్రం ఆ క్షణాన్ని యథాతథంగా భవిష్యత్తు తరాలకు అందిస్తుంది. అందుకే ఫొటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు.. చరిత్రను భద్రపరిచే దృశ్యభాషగా ప్రపంచం నేడు గౌరవిస్తోంది.

ప్రపంచంలో కెమెరా ఆవిష్కరణ జరిగిన కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశంలో ఫొటోగ్రఫీ ప్రారంభమైంది. పురావస్తు సంపద, దేవాలయాలు, రాజ భవనాలు, సంస్కృతి, స్వాతంత్య్రోద్యమం, సామాన్య ప్రజల జీవనవిధానాన్ని కెమెరా ద్వారా భద్రపరిచిన దేశాల్లో మనదేశం ఒకటి. హైదరాబాద్‌తో చిరస్థాయిగా అనుబంధం ఏర్పరచుకున్న రాజా దీనదయాల్‌ భారతీయ ఛాయాచిత్ర చరిత్రలో చిరస్మరణీయుడు. ఆయన చిత్రీకరించిన నిజాం కాలంనాటి హైదరాబాద్‌, చార్మినార్‌, గోల్కొండ కోట, దక్కన్‌ సంస్కృతి నేటికీ ప్రపంచ మ్యూజియంలలో నిల్వవుండటం భారతీయ ఫొటోగ్రఫీ గొప్పతనానికి నిదర్శనం. స్వాతంత్య్రానంతరం హోమైవ్యారావాలా భారతదేశ తొలి మహిళా ఫొటో జర్నలిస్టుగా చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్ర భారత ఆవిర్భావం, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ వంటి మహానుభావుల అరుదైన చిత్రాలను ఆమె కెమెరా చరిత్రలో నిలిపింది. ఆమెకు పద్మవిభూషణ్‌ పురస్కారం లభించింది.

FInal  a2c594cdcd90b42d362e837077cf2fca.png

ఇటీవల మరణించిన రఘురామ్‌ భారతీయ ఫొటో జర్నలిజాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహోన్నత ఛాయాచిత్రకారుడు. ప్రపంచ ప్రఖ్యాత Magnum Photos సభ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకు పద్మశ్రీ పురస్కారం 1971లో లభించింది. భోపాల్‌ గ్యాస్‌ విషాదం, భారత సామాజిక జీవితం, ప్రకృతి, సంస్కృతిపై ఆయన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ముకేష్‌ పర్పియాని (Mukesh Parpiani) భారతదేశంలోని ప్రముఖ ఫొటో జర్నలిస్టులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన ముంబై నగరంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంఘటనలను తన కెమెరాతో చరిత్రగా నమోదు చేశారు. ఫొటో జర్నలిజాన్ని కేవలం వార్తా చిత్రీకరణగా కాకుండా సమాజానికి అర్థమయ్యే కళగా ఆయన తీర్చిదిద్దారు. ఫొటోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా ఫొటో ఎడిటర్‌గా ఆయన విశేష కీర్తి పొందారు. వార్తాచిత్రాల్లో నిజాయితీ, సమయస్ఫూర్తి, దృశ్యప్రభావం, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. డిజిటల్‌ ఫొటోజర్నలిజం ప్రారంభ దశలో కొత్త సాంకేతికతలను స్వీకరించి ఆధునిక విధానాలను వారు ఆ రంగంలో ప్రవేశ పెట్టడంలో ఆయన పాత్ర విశేషమైనది. పదవీ విరమణ అనంతరం ముంబైలోని National Center for The Performing Arts (NCPA) లోని Piramal Art Gallery కి క్యూరేటర్‌గా, ఆ తర్వాత హెడ్‌గా పనిచేశారు. అక్కడ 250కి పైగా ఫొటో ప్రదర్శనలను నిర్వహించి, భారతీయ ఫొటోగ్రఫీ అభివృద్ధికి విశేష కృషిచేశారు. లక్షకుపైగా ఛాయాచిత్రాల డిజిటల్‌ ఆర్కై రూపకల్పనకు నాయకత్వం వహించారు. నేటితరం ఫొటోగ్రాఫర్లలో దయానితాసింగ్‌ ప్రపంచంలోని ప్రముఖ మ్యూజియంలలో తన చిత్రాలను ప్రదర్శించి, 2022లో ప్రతిష్ఠాత్మక Hasselblad Award అందుకున్న తొలి భారతీయ ఫొటోగ్రాఫర్‌గా చరిత్ర సృష్టించారు.

తెలుగునేలలో ఛాయాచిత్రకళకు గొప్ప చరిత్ర ఉంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చెందిన ఛాయాచిత్ర సంస్కృతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫొటోగ్రఫీ అకాడమీ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఛాయాచిత్రకారులు ఈ చరిత్రకు బలమైన పునాదులు వేశారు.

రాజా దీనదయాల్‌, భారతీయ ఛాయాచిత్ర కళా పితామహుడు

తెలుగు నేలలో ఛాయాచిత్ర చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే పేరు రాజా దీనదయాల్‌ (1844–1905). ఆయన జన్మస్థలం ఉత్తర భారతదేశమైనప్పటికీ ప్రతిభ వికసించింది హైదరాబాద్‌లోనే. నిజాం ఆస్థాన అధికారిక ఛాయాచిత్రకారుడిగా పనిచేసిన ఆయన చార్మినార్‌, గోల్కొండ, ఫలక్‌నుమా ప్యాలెస్‌, చౌ మహల్, దక్కన్‌ సంస్కృతి, రాజసంస్థానాల వైభవాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఆయన చిత్రాలు నేడు బ్రిటీష్‌ లైబ్రరీ, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్ (IGNCA) వంటి సంస్థల్లో భద్రపరచబడి ఉన్నాయి. రాణి విక్టోరియా నుంచి రాయల్‌ వారంట్‌ పొందిన తొలి భారతీయ ఫొటోగ్రాఫర్లలో ఆయన ఒకరు. భారతీయ ఛాయాచిత్రకళను ప్రపంచ పటంలో నిలిపిన మహనీయుడిగా రాజా దీనదయాల్‌ను గుర్తిస్తారు.

7.jpg

రాజా త్రయంబకరాజ్‌ బహద్దూర్

పిక్టోరియల్‌ ఫొటోగ్రఫీకి ఆద్యుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కళాత్మక (Pictorial ) ఫొటోగ్రఫీకి బాటలు వేసిన ప్రముఖుల్లో రాజా త్రయంబకరాజ బహద్దూర్‌ ఒకరు. ఆయన Royal Photographic Society (RPS), Great Britain నుంచి Associate (ARPS) గౌరవాన్ని పొందిన తొలి తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అనేకమంది యువ ఛాయాచిత్రకారులకు గురువుగా నిలిచి, తెలుగు రాష్ట్రాల్లో సెలూన్‌ లేదా ఫొటోగ్రఫీ పోటీలకు, అభివృద్ధికి పునాదులు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి ఫొటోగ్రఫీ అకాడమీలలో ఒకటి. వేలాదిమంది ఛాయాచిత్రకారులకు ఇది మార్గదర్శకంగా నిలిచింది. ఈ అకాడమీ ద్వారా శిక్షణా శిబిరాలు, జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించడంతో వేలాది మంది యువ ఛాయాచిత్రకారులు తీర్చిదిద్దబడ్డారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, తెనాలి, రాజమండ్రి, చీరాల, కనిగిరి, గుంటూరు, కరీంనగర్‌,తిరుపతి, వరంగల్‌ వంటి నగరాల్లో ఫొటోగ్రఫీ క్లబ్బులు ఏర్పడి ప్రపంచస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తెలుగు ఛాయాచిత్రకారులు పాల్గొనడం ప్రారంభించారు.

భారతీయ పరిపాలనాసేవ (IAS)లో ఉన్నతాధికారిగా విశిష్ట సేవలందించిన డా. ఎన్‌. భగవాన్‌దాస్‌ గారు పరిపాలనలోనే కాకుండా ఫొటోగ్రఫీ అభివృద్ధికి కూడా విశేష కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫొటోగ్రఫీని ఒక కళగా, విద్యగా, సామాజిక ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1980ల చివరలో రాష్ట్రంలోని ఫొటోగ్రాఫర్లకు శిక్షణ, ప్రదర్శనలు, అంతర్జాతీయస్థాయి అవకాశాలు కల్పించే సంస్థ అవసరాన్ని గుర్తించిన ఆయన, ప్రముఖ ఫొటోగ్రాఫర్లు, కళాకారులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ స్థాపనకు మార్గదర్శకత్వం వహించారు. అనంతరం ఆ అకాడమీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. హైదరాబాద్‌లో పనిచేసిన రాజా దీనదయాల్‌ వారసత్వం నుంచి నేటి అంతర్జాతీయ అవార్డు గ్రహీతల వరకు తెలుగునేల ఫొటోగ్రఫీకి విశేష సేవలందిస్తోంది. బండి రాజన్‌బాబు భారతీయ పిక్టోరియల్‌ ఫొటోగ్రఫీకి కొత్తదిశను చూపించారు. ప్రభాకర్‌ కుసుమ, తమ్మా శ్రీనివాసరెడ్డి వంటి ప్రముఖులు ప్రపంచస్థాయి ఫొటోగ్రఫీ సంస్థలైన Royal Photographic Society (RPS-UK), FIAP, Photographic Society of America (PSA), Fedaration of Indian Photography (FIP) వంటి సంస్థల నుంచి అత్యున్నత గుర్తింపులు పొందారు.

0acd4e28526315f287a824e307502181_rembg.png

పద్మశ్రీ టేకూరి కాశీనాథ్‌, తెలుగు నేల

గర్వించే ఛాయాచిత్ర కళామహర్షి

తెలుగు రాష్ట్రాల ఫొటోగ్రఫీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేర్లలో పద్మశ్రీ టేకూరి కాశీనాథ్‌ (FPSA) ఒకరు. భారతీయ కళాత్మక ఛాయా చిత్రకళను ప్రపంచ వేదికపై నిలబెట్టిన అరుదైన ఛాయాచిత్రకారుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఫొటోగ్రఫీని కేవలం వృత్తిగా కాకుండా ఒక సృజనాత్మక కళగా ప్రజల్లో స్ధాపించేందుకు ఆయన జీవితమంతా అంకితం చేశారు. 20వ శతాబ్ధ మధ్యకాలంలో భారతదేశంలో పిక్టోరియల్‌ ఫొటోగ్రఫీ అభివృద్ధి చెందుతున్న సమయంలో టేకూరి కాశీనాథ్‌ తన వినూత్న దృష్టితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గ్రామీణ జీవితం, భారతీయ సంస్కృతి, ప్రకృతి, మానవ భావోద్వేగాలు, కాంతినీడల సమన్వయం ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన కళాత్మకతను తీసుకొచ్చాయి. ప్రపంచ ఫొటోగ్రఫి రంగంలో దీర్ఘకాలిక సేవలు, విశేష కళాత్మక కృషి చేసిన వారికి మాత్రమే ప్రదానం చేసే అత్యున్నత ఫెలోషిప్‌లో ఒకటి ఫెలో ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా. ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు ఫొటో కళాకారులలో ఆయన ప్రముఖులు. అంతర్జాతీయ ఫొటో పోటీలలో ఆయన చిత్రాలు ఎన్నో బహుమతులు, మెడల్స్‌, ప్రశంసలు అందుకున్నాయి. ఆయన చిత్రాలు అనేక దేశాల్లో ప్రదర్శించబడి భారతీయ ఛాయాచిత్రకళకు గౌరవం తీసుకొచ్చాయి. ఫొటోగ్రఫీ కళకు చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కళారంగంలో ఫొటోగ్రఫికి లభించిన అరుదైన జాతీయ గుర్తింపుల్లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఫొటోగ్రఫీ కూడా సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళలతో సమానమైన సృజనాత్మక కళ అని ఆయన జీవితం నిరూపించింది. ఆయన చిత్రాల ప్రత్యేకత ఏమిటంటే సహజ కాంతిని అద్భుతంగా వినియోగించడం, గ్రామీణ భారత జీవనశైలిని కళాత్మకంగా ఆవిష్కరించడం. నలుపు-తెలుపు (Black and White) చిత్రాల్లో భావోద్వేగాలను ప్రతిబింబించడం. కాంతి, నీడ, ఆకృతి, సమతుల్యత (Composition) కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం. ప్రతి చిత్రం ఒక కథ చెప్పేలా రూపొందించడం. ఆయన చిత్రాలను చూసినప్పుడు అవి కేవలం ఫొటోలు కాకుండా, ఒక చిత్రకారుడి కాన్వాస్‌పై ఆవిష్కరించిన కళాఖండాలుగా అనిపిస్తాయి. టేకూరి కాశీనాథ్‌ అనేకమంది యువ ఫొటోగ్రాఫర్లకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఫొటో క్లబ్బులు, వర్క్‌షాపులు, ప్రదర్శనల ద్వారా ఫొటోగ్రఫీ సాంకేతికతతో పాటు కళాత్మక దృక్పథాన్ని కూడా బోధించారు. ఆయన శిష్యుల్లో చాలా మంది తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఫొటోగ్రఫీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన వారిలో టేకూరి కాశీనాథ్‌ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన విజయాలతో ప్రేరణ పొందిన అనేక మంది ఫొటోగ్రాఫర్లు తరువాత FIAP, FRPS, PSA, FIP, IIPC సంస్థల నుండి అంతర్జాతీయ డిస్టిక్షన్లు సాధించారు.

2fc4ddc206da6d15d7c2a61806641385.jpg

భారత ఫొటో జర్నలిజంలో మహిళల ప్రస్థానం

కెమెరా వెనుక ధైర్యం, సమాజానికి కొత్త దృష్టికోణం, భారతీయ ఫొటో జర్నలిజం చరిత్రలో మహిళల అడుగులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, వారిముద్ర మాత్రం చిరస్థాయిగా నిలిచింది. పురుషాధిక్యంగా భావించిన ఈ రంగంలో మహిళలు తమ ప్రతిభ, ధైర్యం, సామాజిక బాధ్యతతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఆధునిక డిజిటల్‌ యుగం వరకు మహిళా ఫొటో జర్నలిస్టులు భారత సమాజాన్ని తమ కెమెరా కళతో చరిత్రగా నిలిపారు. భారతదేశపు తొలి మహిళా ఫొటో జర్నలిస్టుగా హోమైవ్యారావాలా (1913-2012) చరిత్రలో నిలిచిపోయారు. బ్రిటీష్‌ పాలన చివరి దశ, స్వాతంత్య్ర సమరం, స్వాతంత్ర్య భారత తొలిసంవత్సరాలు, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ, లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ వంటి చారిత్రక వ్యక్తులను ఆమె కెమెరా సజీవంగా నమోదు చేసింది. ఒక మహిళగా అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె భారత ఫొటో జర్నలిజానికి మార్గదర్శకురాలిగా నిలిచారు. ఆమె సేవలకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. హోమై తర్వాత భారతీయ మహిళలు ఫొటోగ్రఫీలో క్రమంగా తమ స్థానాన్ని బలపరచుకున్నారు. ప్రషాంతి అస్వానీ రాజకీయాలు, సామాజిక సంఘటనలను దశాబ్దాల పాటు నమోదు చేశారు. దయానితా సింగ్‌ తన కెరీర్ ను ఫొటో జర్నలిజంతో ప్రారంభించి, తరువాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగారు. సూనీతారాపోరేవాలా భారతీయ పార్సీ సమాజ జీవనాన్ని విశిష్టంగా డాక్యుమెంట్‌ చేశారు. నేటి భారతదేశంలో మహిళా ఫొటో జర్నలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.

స్మితాశర్మ : మానవ అక్రమ రవాణా, మహిళల హక్కులు, యుద్ధ ప్రభావాలు, వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా కథనాలు పై డాక్యుమెంటరీ చేశారు.

సౌమ్య ఖండేల్‌వాల్‌: మహిళల ఆరోగ్యం, పారిశుధ్యం, గ్రామీణ జీవితం, సామాజిక సమస్యలపై ఫొటోగ్రఫీలో విశేష కృషి చేశారు.

పౌలోమీ బసు : లింగ సమానత్వం, వాతావరణ సంక్షోభం, మానవ హక్కుల అంశాలపై అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

అవని రాయ్‌ : పర్యావరణం, ఆదివాసీ సమాజాలు, యువత సమస్యలపై డాక్యుమెంటరీ ఫొటోగ్రఫీ చేశారు.

నందితా రామన్‌ : వలస కార్మికులు, గ్రామీణ జీవితం, జీవనోపాధి అంశాలపై విశేషంగా కవరేజ్‌ చేశారు.

world photo 3.jpg

క్రీడా ఫొటో జర్నలిజంలో మహిళల అడుగులు

క్రీడా ఫొటోగ్రఫీ కూడా మహిళల ప్రతిభను ఆహ్వానిస్తోంది. అభిలాష అగర్వాల్‌ భారత ప్రముఖ మహిళా క్రీడా ఫొటోగ్రాఫర్లలో ఒకరు. ఆసియా కప్‌ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్లను అధికారికంగా చిత్రీకరించిన తొలి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్లలో ఆమె ఒకరు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మహిళా వైల్డ్‌లైఫ్‌ ఫొటోగాఫర్లలో ఐశ్వర్య శ్రీధర్‌ ఒకరు. 2020లో లండన్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక Wild life Photographer of the Year పోటీల్లో విజేతగా నిలిచిన తొలిభారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె National Geographic Explorer డాక్యు మెంటరీ చిత్రనిర్మాతగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పులులు, చిరుతలు, వన్యప్రాణి సంరక్షణ, వన్యజీవుల అక్రమ రవాణా వంటి అంశాలపై ఆమె చేసిన కృషి విశేష ప్రశంసలు పొందింది. భారతదేశంలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి మహిళావైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లలో రాథికా రామస్వామి ప్రముఖులు. ముఖ్యంగా పక్షులు, పులులు, ఏనుగులు, అడవిజీవుల ప్రవర్తనను సహజంగా చిత్రీకరించడంలో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ''భారతదేశపు ప్రముఖ మహిళా వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌''గా ఆమెను పలువురు ప్రముఖులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అనేక మంది మహిళా ప్రకృతి, పక్షి, వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్లు ఎదుగుతున్నారు.

ఈ మధ్యనే చనిపోయిన పక్షుల ఫొటోగ్రాఫర్‌ డాక్టర్‌ సీత కంభంపాటి 82 ఏళ్ళ వయస్సులో సైతం ఆమె భర్త సోమంచి శ్రీనివాసరావుతో కలిసి భారతదేశం అంతటా తిరిగి ''బర్డ్స్‌ బ్యూటీఫుల్‌'' అనే పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఆ తర్వాత ఇద్దరు భూటాన్‌, కెన్యా, టాంజానియా దేశాల్లో వన్యప్రాణులపై చిత్రీకరించి మరో 4 పుస్తకాలు తీసుకొచ్చారు. భారతదేశంలో ఎవరూ చేయని పనిని వారు పూర్తి చేసి తెలుగువారి ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు.

నేటి మహిళలు కేవలం రాజకీయాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కావడం లేదు. యుద్దప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలు, వలసలు, పర్యావరణ సంక్షోభం, మహిళలపై హింస, బాలల హక్కులు, క్రీడలు, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి అనేక అంశాలను ప్రపంచానికి చేరవేస్తున్నారు. వారి దృష్టికోణం వార్తను మాత్రమే కాకుండా మానవీయ కోణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. హోమై వారావాలాతో ప్రారంభమైన భారత మహిళా ఫొటో జర్నలిజం ప్రయాణం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక ప్రతిభావంతుల వరకు విస్తరించింది. కెమెరా కేవలం ఒక పరికరం కాదు. అది చరిత్రను నమోదు చేసే కళ, సమాజానికి అద్దం, సత్యాన్ని ప్రపంచానికి చూపించే శక్తి. ఆ శక్తిని మహిళలు ధైర్యంగా వినియోగిస్తూ భారత ఫొటో జర్నలిజాన్ని మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళా ఫొటో జర్నలిస్టుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువ. అయినప్పటికీ హైదరాబాద్ కు చెందిన రాయిటర్‌ ఫొటో జర్నలిస్టు నిహారిక కులకర్ణి వంటి యువ ఫొటోజర్నలిస్టులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో మహిళలు డాక్యుమెంటరీ, వార్తా ఫొటోగ్రఫీ, విజువల్‌ స్టోరీటెల్లింగ్‌ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

photo ap

తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు...

ఫొటోగ్రఫీ రంగంలో అత్యున్నతమైన అవార్డు గుర్తింపుగా బ్రిటీష్‌ రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ ఫెలోషిప్‌తో సత్కరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఛాయాచిత్రకారులు ఈ ఫెలోషిఫ్‌ పొందాలని జీవితకాలమంతా కృషిచేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రంలో ముగ్గురే ముగ్గురికి ఈ గుర్తింపు లభించింది. పిక్టేరియన్‌ ఫొటోగ్రఫీలో విశేషంగా కృషిచేసిన తెలంగాణాకు చెందిన ప్రముఖ కళాత్మక ఛాయాచిత్రకారుడు, పిక్టోరియల్‌ ఫొటోగ్రఫీకి కొత్త దిశ చూపిన కీర్తిశేషులు బండి రాజన్‌బాబు (హైదరాబాద్‌), కీర్తిశేషులు కుసుమ ప్రభాకర్‌ (వరంగల్‌), ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే పొంది తెలుగువారి ప్రతిభను నిరూపించారు. 2021లో జర్నలిజం అంశంలో విజయవాడకు చెందిన తమ్మా శ్రీనివాసరెడ్డికి ఈ పురస్కారం లభించింది. అయితే ఆంధ్రపదేశ్‌, తెలంగాణా ప్రాంతాల్లో దాదాపు 24 మంది తెలుగువారు లైసెన్సుడు, అసోసియేట్‌షిప్‌లు సాధించి దేశంలోనే అధిక సంఖ్యలో రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ నుంచి పురస్కారం పొందారు. నేచర్‌, పిక్టోరియల్‌, జర్నలిజం అంశాల్లో వీరు సాధించారు.

96675a351f0dbee13609be548c271f9c-removebg-preview.png

డిజిటల్‌ విప్లవం

ఫొటోగ్రఫీలో నూతన యుగం 2000 సంవత్సరం తర్వాత ప్రపంచ ఫొటోగ్రఫీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసు కున్నాయి. ఫిల్మ్‌ కెమెరాల యుగం క్రమంగా ముగిసి, డిజిటల్‌ కెమెరాల యుగం ప్రారంభమైంది. ఈమార్పు ఫొటోగ్రఫీని కేవలం వృత్తిపరమైన కళగామాత్రమే కాకుండా, ప్రతి సామాన్యుడి చేతిలోకి తీసుకొచ్చింది. ఒక్క బటన్‌ నొక్కగానే ఫొటోతీసి వెంటనే చూడగలిగే సౌలభ్యం, వేలాది చిత్రాలను మెమరీకార్డుల్లో నిల్వచేసే అవకాశం, కంప్యూటర్ల ద్వారా సులభంగా సవరించే సాంకేతికత ఫొటోగ్రఫీకి కొత్తదిశను చూపాయి. 2000ల ప్రారంభంలో Canon, Nikon, Sony, Olympus, Fujifilm, Panasonic వంటి సంస్థలు అధిక నాణ్యతగల డిజిటల్‌ కెమెరాలను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఫిల్మ్‌ కొనుగోలు, డెవలప్‌మెంట్‌, ప్రింటింగ్‌ వంటి ఖర్చులు గణనీయంగా తగ్గిపోయాయి. డిజిటల్‌ కెమెరాల అభివృద్ధితో రంగులు, వివరాలు, తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన చిత్రాలను నమోదుచేయడం సాధ్యమైంది. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన చిత్రాలను నమోదు చేయడం సాధ్యమైంది.Digital Single-Lens Reflex (DSLR) కెమెరాలు ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన ఫొటోగ్రాఫర్లకు ప్రధాన ఆయుధంగా మారాయి. పెద్ద సెన్సార్లు, మార్చుకునే లెన్సులు, వేగవంతమైన ఆటోఫోకస్‌, RAW ఫార్మాట్‌లో చిత్రాలు నమోదు చేసే సౌకర్యం వల్ల వార్తా, వన్యప్రాణి, క్రీడలు, వివాహాలు, ప్రకృతి, ఫ్యాషన్‌, ప్రకటనల రంగాల్లో DSLRలు విస్తృతంగా ఉపయోగించడం జరుగుతోంది.

సాంకేతిక అభివృద్ధితో Mirrorless Cameras DSLRsకు ప్రత్యామ్నాయంగా ఎదిగాయి. తక్కువ బరువు, చిన్న పరిమాణం, వేగవంతమైన ఆటోఫోకస్‌, కంటి గుర్తింపు (Eye Detection AF,) సైలెంట్‌ షూటింగ్‌, అత్యుత్తమ వీడియో సామర్థ్యాలతో ఇవి ప్రపంచ ఫొటోగ్రాఫర్లకు మొదటి ఎంపికగా మారాయి.

నేడు Canon, Sony, Nikon, Fujifilm, Panasonic వంటి ప్రముఖ కంపెనీలు ప్రధానంగా మిర్రర్‌ లెస్‌ కెమెరాలపై దృష్టిసారిస్తున్నాయి.

2015 తరువాత డ్రోన్‌ కెమెరాల వినియోగం విపరీతంగా పెరిగింది. భూమిపై నిలబడి ఎప్పటికీ చూడలేని కోణాలను ఆకాశం నుంచి చిత్రీకరించడం సాధ్యమైంది. ప్రకృతి దృశ్యాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యవసాయ భూములు, నిర్మాణాలు, వివాహ వేడుకలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, వార్తాకథనాలు, విపత్తుల అంచనాల్లో డ్రోన్‌ ఫొటోగ్రఫీ కీలకపాత్ర పోషిస్తోంది.

2007లో సెల్‌ఫోన్‌ యుగం ప్రారంభమైన తరువాత ఫొటోగ్రఫీ ప్రపంచంలో మరో మహత్తర విప్లవం చోటుచేసుకుంది. నేడు కోట్లాది మంది ప్రతి రోజూ సెల్‌ఫోన్‌తోనే ఫొటోలు తీస్తున్నారు. మల్టిపుల్‌ కెమెరాలు, పోర్ట్రెయిట్‌మోడ్‌, నైట్‌మోడ్‌, మాక్రో, అల్ట్రావైడ్‌, టెలిఫొటోలెన్స్‌లు, AI ఆధారిత ఇమేజ్‌ ప్రోసెసింగ్‌ గల చిన్న మొబైల్‌ కెమెరాలతో కూడా అత్యుత్తమ నాణ్యత గల చిత్రాలను నమోదుచేయడం సాధ్యమైంది. Facebook, Instagram, Flickr, YouTube, WhatsApp వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫొటోలు క్షణాల్లో కోట్లాదిమందికి చేరుతున్నాయి.

2026 నాటికి ఫొటోగ్రఫి కేవలం ఒక కళమాత్రమే కాదు. అది విజ్ఞాన, సాంకేతికత, కమ్యూనికేషన్‌, డాక్యుమెంటేషన్‌, జర్నలిజం, విద్య, వైద్య, పరిశోధన, అంతరిక్షం అన్వేషణ, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాలకు కీలకసాధనంగా మారింది. AI, 3D ఇమేజింగ్‌, వర్చువల్‌ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్‌రియాలిటీ (AR), కంప్యూటేషన్లలో ఫొటోగ్రఫీ వంటి సాంకేతికతలతో భవిష్యత్తులో ఫొటోగ్రఫీ మరింత విస్తృతమైన సృజనాత్మక ప్రపంచాన్ని ఆవిష్కరించనుంది.

1839లో ప్రారంభమైన ఫొటోగ్రఫీ ప్రయాణం రసాయనిక ప్రక్రియల నుంచి డిజిటల్‌ యుగానికి, అక్కడి నుంచి కృత్రిమమేధస్సు ఆధారిత సృజనాత్మక ప్రపంచానికి చేరుకుంది. భవిష్యత్తులో సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, గొప్ప ఫొటోగ్రఫికి మూలం మాత్రం మానవ దృష్టి, భావోద్వేగం, సృజనాత్మకత, నిజాయితీగానే ఉంటుంది. కెమెరా ఒక సాధనం మాతమే; కథను చెప్పేది, చరిత్రను నమోదు చేసేది, సమాజాన్ని ఆలోచింపజేసేది ఫొటోగ్రాఫర్‌ చూపే. 2050 నాటికి కెమెరాలు కళ్ళజోడు, గడియారం లేదా ఇతర ధరించగల పరికరాల్లో అంతర్భాగంగా ఉండే అవకాశం ఉంది. క్షణాల్లో బహుళకోణాల నుంచి చిత్రీకరణ, తక్షణ భాషా అనువాద, ప్రత్యక్ష వస్తువు గుర్తింపు, ఆరోగ్య విశ్లేషణ, పర్యావరణ అంచనాలు వంటి సామర్ధ్యాలు ఫొటోగ్రఫీతో కలిసిపోవచ్చు. వ్యక్తిగత జ్ఞాపకాల సంరక్షణ నుంచి శాస్త్రీయ పరిశోధనల వరకు ఫొటోగ్రఫీ మరింత విస్తృతమైన పాత్రను పోషించే అవకాశం ఉంది.

మన గ్రామాలు, మన సంస్కృతి, మన పండుగలు, మన రైతు, మన కళాకారులు, మన ప్రకృతిసంపద, మన వారసత్వ కట్టడాలు ఇవన్నీ భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి యువ ఛాయాచిత్రకారులపై ఉంది. కెమెరా ఒక పరికరం మాత్రమే కాదు. అది సమాజాన్ని చూసే దృష్టి. ఒక మంచి ఫోటో చరిత్రను మార్చగలదు. ఒక చిత్రం మనసులను కదిలించగలదు. ఒక ఛాయాచిత్రం తరాలను ఆలోచింపజేయగలదు. ''సాంకేతికత ఫొటోను సృష్టించగలదు. కానీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాన్ని సృష్టించేది మానవ దృష్టి, విలువలు, సృజనాత్మకత మాత్రమే.''

world photo 2.jpg

ప్రపంచ ఘటనలకు దృశ్య భాష

  • మయన్మార్‌లో రొహింగ్యాలపై జరిగిన ఊచకోతను కెమెరాలు మౌనంగా చూడలేదు—బాధితుల కన్నీటికి ప్రపంచం ముందు ఒక దృశ్య భాషను ఇచ్చాయి.

  • గాజాలో శిథిలాల మధ్య ఆకలితో అలమటిస్తున్న పిల్లల చిత్రాలు యుద్ధం వెనుక దాగిన మానవ విషాదాన్ని ప్రపంచ కళ్ల ముందుంచాయి.

  • తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి దృశ్యం వంటి ఫొటోలు యుద్ధాన్ని గణాంకాల నుంచి మానవ వేదనగా మార్చాయి.

  • ఇరాన్‌పై జరిగిన దాడులు, సామ్రాజ్యవాద శక్తుల జోక్యాల మధ్య కెమెరా యుద్ధ రాజకీయాల కంటే సాధారణ ప్రజల జీవితాలపై దృష్టి పెట్టింది.

  • బాంబుల శబ్దాల మధ్య పరుగులు తీస్తున్న కుటుంబాలు, ధ్వంసమైన ఇళ్లు—ఫొటోగ్రాఫర్లకు అవి కేవలం వార్తా దృశ్యాలు కాదు, చరిత్రకు సాక్ష్యాలు.

  • గుజరాత్‌లో మత ఘర్షణల దృశ్యాలను చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్లు హింస వెనుక మిగిలిన మానవ గాయాలను నమోదు చేశారు.

  • బాధితుల ఫొటోలు కేవలం గతాన్ని గుర్తుచేసే చిత్రాలుగా కాకుండా న్యాయం కోసం నిలిచిన దృశ్య సాక్ష్యాలుగా మారాయి.

  • ముంబైలో మత విద్వేషం రగిలిన వేళ కెమెరాలు మంటలను మాత్రమే కాదు—ఆ మంటల్లో కాలిపోతున్న సామాన్యుల జీవితాలను కూడా పట్టుకున్నాయి.

  • చిలీలో రైతుల పోరాటాల్లో కెమెరా పొలాల్లోని చెమటను, నిరసనల్లోని ఆగ్రహాన్ని, హక్కుల కోసం నిలిచిన ప్రజల సంకల్పాన్ని ప్రపంచానికి చూపించింది.

  • సోమాలియాలో ఆకలి కేకలను చిత్రించిన ఫొటోగ్రాఫర్లు ఒక ఖాళీ కడుపును ప్రపంచ మనస్సాక్షి ముందుంచారు.

  • ఆకలితో కుంగిపోయిన చిన్నారి చిత్రం ఒక దేశపు దుస్థితిని మించి మానవ సమాజం ఎదుర్కొంటున్న అసమానతకు ప్రతీకగా నిలిచింది.

  • ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై లాఠీలు ఎగిసినప్పుడు కెమెరాలు ప్రజాస్వామ్య ప్రశ్నలకు ఎదురైన నిర్బంధాన్ని నమోదు చేశాయి.

  • లాఠీ దెబ్బల మధ్య కూడా ప్రశ్నించే విద్యార్థి ముఖం—అధికారానికి ఎదురుగా నిలిచిన యువత స్వరానికి దృశ్యరూపమైంది.

  • ఫొటోగ్రాఫర్‌ చేతిలోని కెమెరా ఒక ఆయుధం కాదు; కానీ అది అధికారిక కథనాలకు ప్రత్యామ్నాయంగా నిలిచే శక్తివంతమైన సాక్ష్యం.

  • యుద్ధభూముల్లో, శరణార్థి శిబిరాల్లో, నిరసన ప్రదేశాల్లో ఫొటోగ్రాఫర్లు భయాన్ని దాటి మానవ జీవితాలను నమోదు చేశారు.

అందుకే చరిత్రను రాసిన కలంతో పాటు చరిత్రను చూపించిన కెమెరాకు కూడా సమానమైన ప్రాధాన్యం ఉంది.ఆ చిత్రాలే కాలానికి సాక్ష్యాలై, మానవత్వం కోసం చరిత్రను ప్రశ్నిస్తూ నిలిచాయి.

pilla akrandhanalu

ఈ ఏడాది ‘హోమ్‌’

థీమ్‌ గత కొన్నేళ్లుగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని వివిధ థీమ్ లతో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా మార్చిలో ఫ్రెంచి మినిస్టరీ ఆఫ్‌ కల్చరల్‌, ఆస్ర్టేలియాకు చెందిన వరల్డ్ ఫొటో ఆర్గనైజేషన్‌ సంస్థ కొరేసాకా ఆరా కలిసి థీమ్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది 2026 సంవత్సరానికిగాను ‘‘హోమ్‌’’ అనే థీమ్‌ను ప్రకటించాయి. అయితే ‘ఇల్లు’ థీమ్‌కు విస్తృతమైన అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఈ ‘home’ థీమ్‌ ప్రతి ఫొటో గ్రాఫర్‌కు వేర్వేరు కథను గుర్తుచేస్తోంది. ఈ థీమ్‌ పోర్ర్టెయిట్‌, డాక్యుమెంటరీ, స్ర్టీట్‌, ల్యాండ్‌ స్కేప్‌, వైల్డ్ లైఫ్‌, ఆర్కిటెక్చర్‌, ఫ్యామిలీ, మొబైల్‌ ఫొటోగ్రఫీ అన్నింటికీ వర్తించే అంశం. తమ వారి అభిరుచికి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు తాము తీసిన ఫొటోల వెనుక కథతో కలిపి సోషల్‌ మీడియాతో పంచుకోవచ్చు. సాధారణంగా మన చిన్ననాటి ఇల్లు, పెరిగిన ప్రదేశాలు, వీధి, పాఠశాల, పొలం, మన తొలిజ్ఞాపకాలు కావొచ్చు. ఇది నా నేల అనిపించే ప్రదేశం. ఉధాహరణకు కృష్ణా, గోదావరి తీరాలు, పల్లెలు సైతం నా ఇల్లు అనే భావన వస్తుంది. ‘హోమ్‌’ అంటే నాలుగు గోడలు మాత్రం కాదు. తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, పిల్లలు, కుటుంబ సాంప్రదాయాలు, వారితో గడిపిన క్ష‍ణాలు ఈ థీమ్‌కు అర్థవంతమైన అంశాలు. ప్రస్తుతం ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు, యువతరం విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి బ్రతుకుతున్న వారికి ఈ థీమ్‌ బహుశా వారి మనసులను హత్తుకునే అంశం. ఒక పండుగ, సాంప్రదాయాలు, వంటకం, దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు ఇవి కూడా సమాజానికి ‘ఇల్లు’ అనే భావన ప్రతిబింబించే అవకాశం ఉంది. అడవులు, నదులు, సముద్రం, పర్వతాలు, పక్ష‍ులు, వన్యప్రాణులతోపాటు మనిషికి ‘ఇల్లు’ ఉంటుంది. ప్రతి జీవికి ఉండే ‘హోమ్‌’ నివాసం. పర్యావరణ పరిరక్ష‍ణకు బలమైన సందేశంగా చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రిందట తాతల కాలం నాడు ఇంటిని పడగొట్టి నిర్మించినప్పటికీ ఆనాటి చిత్రం తన గత స్మృతులను గుర్తుకు తెస్తాయి. ‘ఇల్లు’ అంటే కాంక్రీటు గోడలు మాత్రమే కాదు. మన జ్ఞాపకాలు మొదలయ్యేచోటు. మనకు మనం అనిపించే ప్రదేశం. మన సంస్కృతి, ఊపిరి పీల్చేనేల అందుకే ప్రపంచ ఛాయాచిత్రకారులారా మీరు తీసే చిత్రాలను మీ మీ కెమెరాల్లో క్లిక్‌ మనిపించి ఈ ప్రపంచానికి 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున మీ మీ బంధువులు, మిత్రులతో పంచుకోండి. ఇదే ఈ థీమ్‌ ముఖ్యోద్దేశ్యం.


తమ్మా శ్రీనివాసరెడ్డి

MAPS, MFIP, FRPS, EPSA, FIIPC

అతిథి అధ్యాపకులు, ఫొటోగ్రఫీ విభాగం,

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, 9848074688


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్