ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిన్నజీవి... పెద్ద ముప్పు!

1 గంట క్రితం

62505a410a535e83fe3c6b3b050b6a1c_rembg.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 07:12 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

ప్రపంచ దోమల దినోత్సవం

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? సింహం, పులి, షార్క్‌, విషసర్పం వంటి సమాధానాలే చాలామందికి గుర్తుకొస్తాయి. కానీ మానవాళికి అత్యధిక ప్రాణనష్టం కలిగించే జీవుల్లో కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే దోమ ముందుంటుంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అనారోగ్యానికి గురవుతుండగా, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే దోమను కేవలం ఒక కీటకంగా కాకుండా ప్రపంచ ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

వర్షాకాలం వచ్చిందంటే రైతు ముఖంలో ఆనందం కనిపిస్తుంది. పచ్చని ప్రకృతి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే వర్షాలతో పాటు నిల్వ నీరు, తేమ, చెత్త, మురుగునీరు పెరగడం దోమల వృద్ధికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. ఇంటి ఆవరణలోని చిన్న నీటి పాత్ర నుంచి పాత టైరు, పూల కుండీ, కొబ్బరి చిప్ప, ప్లాస్టిక్‌ కప్పు, ఫ్రిజ్‌ ట్రే, కూలర్‌ వరకు ఏ చిన్న నీటి నిల్వ అయినా దోమల ఉత్పత్తి కేంద్రంగా మార్చొచ్చు. అందుకే వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచే వ్యక్తిగతంగా, సామూహికంగా అప్రమత్తత అవసరం.ఒక కుటుంబం తన ఇంటిని పరిశుభ్రంగా ఉంచితే ఒక వీధి సురక్షితమవుతుంది. ప్రతి వీధి పరిశుభ్రంగా ఉంటే ఒక గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ప్రజారోగ్యం ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ప్రారంభం కాదు.. ప్రతి ఇంటి గడప వద్దే ప్రారంభమవుతుంది. ప్రపంచ దోమల దినోత్సవం నం మనకు చెప్పే ప్రధాన సందేశం ఒక్కటే. దోమలను పూర్తిగా నిర్మూలించడం కంటే, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడం సాధ్యమైన, సమర్థవంతమైన లక్ష్యం. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, వైద్య సిబ్బంది, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ప్రజలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఈ పోరాటం ఫలిస్తుంది.

ఆగస్టు 20 ఎందుకు ప్రత్యేకం?

ఏటేటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1897 ఆగస్టు 20న తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో పరిశోధనలు నిర్వహించిన సర్‌ రోనాల్డ్‌ రాస్‌ మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుందని శాస్త్రీయంగా నిరూపించారు. ఈ పరిశోధన మలేరియా నియంత్రణకు శాస్త్రీయ పునాది వేసింది. వైద్య చరిత్రలో కీలకమైన ఈ ఆవిష్కరణకు గుర్తుగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రమాదకరం ఎందుకంటే...

ప్రపంచంలో 3,500 కు పైగా దోమ జాతులు ఉన్నప్పటికీ, కొద్దిమాత్రమే మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అనాఫిలిస్‌ దోమ మలేరియాను, ఏడిస్‌ దోమ డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులను, క్యూలెక్స్‌ దోమ ఫైలేరియా, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. మగ దోమలు సాధారణంగా మనుషులను కుట్టవు. గుడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్‌ కోసం ఆడ దోమలు రక్తాన్ని పీలుస్తాయి. ఈ సమయంలో వైరస్‌లు లేదా పరాన్నజీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న కాటు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యానికి దారితీయొచ్చు.

వాతావరణ పరిస్థితుల్లో మార్పూ కీలకమే

వాతావరణ మార్పులు, అనియంత్రిత పట్టణీకరణ, నీటి నిర్వహణలో లోపాలు, పరిశుభ్రత కొరవడి ఉండటం దోమల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను పెంచుతున్నాయి. ఉష్ణోగ్రతలు, తేమ పెరగడం, అస్థిర వర్షపాతం, నగరాల విస్తరణతో దోమల జీవచక్రం వేగవంతమవుతోంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన దోమల వ్యాధులు ఇప్పుడు కొత్త ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు సూచిస్తున్నాయి. మలేరియా ఇప్పటికీ అనేక దేశాల్లో సమస్యగానే ఉండగా, డెంగ్యూ వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీంతో దోమల నియంత్రణ కేవలం వైద్యశాఖ పని కాకుండా పర్యావరణం, పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం, నీటి నిర్వహణతో ముడిపడిన అంశంగా మారింది.

పట్టణాల్లో డెంగ్యూ ప్రమాదాలు

ప్రస్తుతం ప్రజల్లో ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న దోమల వ్యాధుల్లో డెంగ్యూ ముఖ్యమైనది. దీన్ని వ్యాప్తి చేసే ఏడిస్‌ ఈజిప్టై దోమ పగటి వేళల్లో ఎక్కువగా కుడుతుంది. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న పరిశుభ్రమైన నీటిలో కూడా ఇది గుడ్లు పెట్టగలదు. అందువల్ల ఇంటి చుట్టూ కనిపించే చిన్న నీటి నిల్వలను నిర్లక్ష్యం చేయకూడదు.

అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, చర్మంపై మచ్చలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డెంగ్యూ వచ్చిన ప్రతి సందర్భంలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయనే అపోహకు తావివ్వకుండా వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు, చికిత్స తీసుకోవాలి. స్వయంగా మందులు వాడటం ప్రమాదకరం.

ప్రత్యేక కార్యాచరణ

వర్షాకాలం ప్రారంభంతో ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణను చేపడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేలు నిర్వహించడం, అనుమానిత కేసులను గుర్తించడం, రక్త నమూనాలు సేకరించడం, అవసరమైన పరీక్షలు చేయించడం, మందులు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, స్థానిక సంస్థల సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఫాగింగ్‌, యాంటీ లార్వా చర్యలు, డ్రెయినేజీల శుభ్రత, చెత్త తొలగింపు, నిల్వ నీటి నిర్మూలన వంటి చర్యలు కొనసాగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య సూచనలు, జిల్లా స్థాయిలో సమీక్షలు కూడా ఇందులో భాగమే.

అన్ని శాఖల సమన్వయంతో

దోమల నిర్మూలన కోసం వైద్యశాఖ ఇతర శాఖలైన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ పరిపాలన, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమం, నీటిపారుదల, పశుసంవర్ధక తదితర శాఖల సమన్వయంతో కృషిచేస్తోంది. పారిశుధ్యం మెరుగుపడితే దోమల ఉత్పత్తి కేంద్రాలు తగ్గుతాయి. నీటి నిల్వలను సక్రమంగా నిర్వహిస్తే లార్వా పెరుగుదలను అడ్డుకోవచ్చు. ప్రజల భాగస్వామ్యం దీనికి మరింత బలం చేకూరుస్తుంది.

ప్రతి శుక్రవారం... డ్రై డే

దోమల ఉత్పత్తి కేంద్రాలను అరికట్టడానికి వారానికి ఒక రోజు ఇంటి పరిసరాలను పరిశీలించడం ప్రభావవంతమైన చర్య. ‘ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటిస్తూ పూల కుండీలు, కూలర్లు, ఫ్రిజ్‌ ట్రేలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీటి డబ్బాలు తదితరాలను శుభ్రం చేయాలి. నీరు నిల్వ ఉంటే తొలగించాలి. వారానికి కేవలం పది నిమిషాలు ఇంటి పరిసరాల పరిశుభ్రతకు కేటాయించడం ద్వారా మొత్తం కుటుంబాన్నే కాదు, కాలనీని కూడా రక్షించొచ్చు.

ఏజెన్సీలో ప్రత్యేకంగా అప్రమత్తత

రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రత్యేక ఆరోగ్య సవాళ్లను తెస్తుంది. దట్టమైన అడవులు, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాలు, నిల్వ నీరు, పరిమిత రవాణా సౌకర్యాలు, దూర ప్రాంతాల్లో వైద్య సేవలు ఆలస్యంగా అందే పరిస్థితులు వ్యాధుల నియంత్రణను మరింత క్లిష్టం చేస్తాయి. అందుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల వారీగా జ్వర సర్వేలు నిర్వహిస్తున్నాం. అనుమానిత మలేరియా, డెంగ్యూ కేసులను త్వరగా గుర్తించి చికిత్స అందించడం, అవసరమైన మందులు, ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్లు అందుబాటులో ఉంచడం, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక నిఘా పెట్టడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.

మలేరియాపై అప్రమత్తత అవసరం

మలేరియా ఇప్పటికీ అనేక గ్రామీణ, అటవీ ప్రాంతాలకు సవాలుగా ఉంది. అనాఫిలిస్‌ దోమ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తొలుత సాధారణ జ్వరంలా కనిపించినా, చికిత్స ఆలస్యం అయితే తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. అందువల్ల జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పరీక్షలు చేయడం, రక్త నమూనాలు సేకరించడం, వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించడం అత్యంత కీలకం.

దోమతెర-ఆరోగ్య రక్షణ కవచం

దోమల నియంత్రణలో తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించగల రక్షణ సాధనం దోమతెర. ముఖ్యంగా రాత్రివేళ కుట్టే మలేరియా దోమల నుంచి రక్షణకు దోమతెర ఎంతో ఉపయోగకరం. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేకంగా దోమల నుంచి రక్షణ కల్పించాలి. కిటికీలకు మెష్‌లు అమర్చడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, అవసరమైనప్పుడు దోమల నివారణా క్రీములు ఉపయోగించడం వంటి వ్యక్తిగత రక్షణ చర్యలు కూడా పాటించాలి.

ఆరోగ్య సూత్రాలు

• ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండనివ్వకండి.

• వారానికి ఒకసారి కూలర్లు, పూల కుండీలు, ఫ్రిజ్‌ ట్రేలు, నీటి డబ్బాలు శుభ్రం చేయండి.

• తాగునీటి పాత్రలను మూతపెట్టి ఉంచండి.

• జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోండి.

• వైద్యుల సలహా లేకుండా మందులు వాడకండి.

• పిల్లలు, గర్భిణులు, వృద్ధులను దోమల కాట్ల నుంచి ప్రత్యేకంగా రక్షించండి.

• ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తల సూచనలు పాటించండి.

dr b.subramanyeswari

డాక్టర్‌ బండారు.సుబ్రహ్మణ్యేశ్వరి
అదనపు సంచాలకులు, రాష్ట్ర వ్యాధి నియంత్రణ కార్యక్రమ విభాగం

ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, విజయవాడ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్