సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి నటికి తొలి సినిమా ఒక పరిచయం మాత్రమే. కానీ ఆ పరిచయం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోవాలంటే అందం, అదృష్టం మాత్రమే సరిపోవు. పాత్రకు తగ్గ సహజత్వం, హావభావాల్లో నిజాయితీ, సంభాషణల్లో స్పష్టత, తెరపై కనిపించే ఆత్మవిశ్వాసం అవసరం. యువనటి మమితా బైజు మలయాళ చిత్రసీమలోకి చిన్న వయసులోనే అడుగుపెట్టారు. ఒక్కో సినిమాతో తన పరిధిని పెంచుకుంటూ ఇప్పుడు తమిళ చిత్రసీమలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ మధ్య విడుదలైన ‘‘విశ్వనాథ్ & సన్స్’’ సినిమాలో హీరో సూర్యాతో సమానంగా ఆమె నటించడం చూసి ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కేరళలో కొట్టాయం జిల్లా కిడంగూరులో జన్మించిన మమితా బైజు, చదువుతో పాటు నృత్యం, మోడలింగ్ వంటి రంగాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె పాఠశాల విద్య మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్, కట్టచిరా, ఎన్.ఎస్.ఎస్. హయ్యర్ సెకండరీ స్కూల్ కిడంగూరులో సాగింది. ఆ తర్వాత కొచ్చిలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీలో సైకాలజీలో బీఎస్సీ చదువుకున్నారు. స్కూలు డేస్ నుంచే మమితకు కెమెరా, ప్రదర్శన కళలతో పరిచయం ఉంది. క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తి, మోడలింగ్ అనుభవం ఆమెకు తెరపై నటించేందుకు ధైర్యాన్ని పెంచాయి.
చిన్న పాత్రతో మొదలై..
‘‘సర్వోపరి పాలక్కారన్’’ సినిమాతో 2017లో వచ్చిన మమితా బైజు సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ‘‘హనీ బీ 2: సెలబ్రేషన్స్’’, ‘‘దకిని’’, ‘‘కృష్ణం’’, ‘‘వరతన్’’, ‘‘స్కూల్ డైరీ’’ వంటి చిత్రాల్లో చిన్న, సహాయ పాత్రలు చేశారు. ఈ ప్రాతలన్నీ నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశం మాత్రం ఇచ్చాయి. వచ్చిన చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా కెమెరా ముందు కనిపిస్తూ, అనుభవాన్ని కూడబెట్టుకున్నారు. నటిగా ఎదగడంలో ఈ దశ ఎంతో కీలకం అని ఓ ఇంటర్వ్యూలో మమితా తెలిపారు. 2019లో ‘‘వికృతి’’, ‘‘యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ’’, 2020లో ‘‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’’ వంటి చిత్రాల్లో నటించారు. పాత్ర పరిమాణం కంటే, ప్రతి సినిమాలో కొత్త అనుభవాన్ని సంపాదించుకోవడమే ఆమె సినిమా ప్రయాణానికి బలం అయింది.

‘‘అంజు’’గా గుర్తింపు..
‘‘ఆపరేషన్ జావా’’ చిత్రంలో ‘‘అల్ఫోన్సా’’ పాత్ర, ‘‘ఖో ఖో’’లో ‘‘అంజు’’ పాత్రలు మమితా బైజు కెరీర్‌లో కీలకమలుపు తిప్పాయి. నటిగా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఈ చిత్రం ఒక స్పోర్ట్స్ డ్రామా కావడంతో పాత్రలో ఉండే శారీరక చురుకుదనం, యువతకు సంబంధించిన భావోద్వేగాలు, జట్టు వాతావరణం వంటి అంశాలను మమితా బైజు తెరపై వ్యక్తీకరించిన తీరు- ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు. 2021లో విడుదలైన ‘ఆపరేషన్ జావా’లోనూ అల్ఫోన్సాగా తెరపై కనిపించిన ప్రతిసారీ ఆమె నటనలోని సహజత్వం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. భావోద్వేగ సన్నివేశాలు ఎదురైనప్పుడు ఆమె పెద్దగా హావభావాలు ప్రదర్శించలేదు. బదులుగా కళ్లలో కనిపించే ఆందోళన, ముఖంలో వచ్చే చిన్న మార్పులు, మాటల మధ్య వచ్చే విరామాలతో ఆ భావాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించింది. ఇదే ఆమె నటనను సహజంగా నిలబెడుతుంది. ఈ రెండు చిత్రాల తర్వాత మమితకు పరిశ్రమలో అవకాశాలు క్రమంగా పెరిగాయి.
తన వ్యక్తిత్వానికి దగ్గరగా
‘‘సూపర్ శరణ్య’’ చ్రితంలో మమితా బైజు కెరీర్‌లో మరో కీలక మలుపు. ఇందులో సోనా థామస్‌గా కనిపించిన ఆమె చలాకీతనం, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 2023లో ‘‘ప్రణయ విలాసం’’, ‘‘రామచంద్ర బాస్ అండ్ కో’’ వంటి చిత్రాల్లో కనిపించిన మమిత, ఆ తర్వాత తన కెరీర్‌లోనే అతిపెద్ద అవకాశాన్ని అందుకున్నారు. అదే.. ‘‘ప్రేమలు’’. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌తో కలిసి ఆమె రీనూ రాయ్ పాత్రలో నటించారు. సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత స్వయంగా రీనూ పాత్రలో తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఆమె పాత్ర కేవలం హీరో చుట్టూ తిరిగే పాత్రగా ఉండదు. తన అభిప్రాయాలు, తన వ్యక్తిత్వం, తన భావోద్వేగాలు ఉన్న యువతిగా రీనూ కనిపిస్తుంది. కామెడీ సన్నివేశాల్లో టైమింగ్, సీరియస్ సన్నివేశాల్లో హావభావాలు, ముఖ్యంగా భావోద్వేగ క్షణాల్లో కళ్లతోనే స్పందించే తీరు మమితకు మంచి పేరు తెచ్చింది. ఈ విజయం మమితకు కేవలం ఒక హిట్ ఇవ్వలేదు. దక్షిణాది ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసింది. మలయాళంలో గుర్తింపు పొందిన నటి నుంచి దక్షిణ భారత చిత్రసీమలో చర్చనీయాంశమైన యువ నటిగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. తమిళంలో ‘‘రెబల్’’లో సారా మేరీ జాన్ పాత్రలో కనిపించారు. ‘‘డ్యూడ్’’లో కురళ్ పాత్ర, ‘‘కారా’’ వంటి చిత్రాలు ఆమెను తమిళ ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.

ఇప్పుడు ‘విశ్వనాథ్ & సన్స్’
మమితా బైజు కెరీర్‌లో ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ &సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య ప్రధానపాత్రలో నటించారు. మమిత ‘మ్యాడీ’ అనే కీలకపాత్రలో నటించారు. ఆగస్టు 14న ఈ సినిమా విడుదలైంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన హీరోతో ప్రేమలో పడటం, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఆమె ప్రాతతో ప్రేక్షకులను, అభిమానులను మెప్పించారు. సూర్య వంటి స్టార్‌తో కలిసి నటించడం మమితకు కూడా ప్రత్యేకమైన అనుభవమే. ఆడియో లాంచ్ సందర్భంగా సూర్య తనకు స్ఫూర్తి అని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు కల అని చెప్పారు. దాన్ని ఈ సినిమాతో నిజం చేసుకున్న మమిత మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని కోరుకుందాం.
పేరు : మమితా బైజు
పుట్టినతేది : 2001 జూన్ 22న
తండ్రి: డా. బైజు కృష్ణన్ ( వైద్యుడు), తల్లి: మినీ బైజు
అన్నయ్య : మిథున్ బైజు
అవార్డులు: కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ పురస్కారం (‘‘ఖో ఖో’’)








కామెంట్‌లు (0)