కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ఆంక్షలు
విజయవాడ: భారీ వర్షంతో విజయవాడ నగరంలో జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ గేటు వద్ద ఉన్న బ్రిడ్జిపైకి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లో బ్రిడ్జి వద్ద మోకాళ్ల లోతుకు పైగా నీరు ప్రవహిస్తుండటంతో ఓ బస్సు నీటిలోనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌పై రాకపోకలను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ సిటీ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆయా మార్గాల్లోనూ వాహనాల రద్దీ పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప వాహనదారులు బయటకు రావొద్దని, నీరు ప్రవహిస్తున్న లోతట్టు ప్రాంతాలు, బ్రిడ్జిలపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







కామెంట్‌లు (0)