ముంబై–ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన 35 వేల మందికి పైగా ప్రజలు
అధికారుల లిఖితపూర్వక హామీతో ఆందోళన విరమణ
ముంబై : స్మార్ట్ మీటర్ల బలవంతపు ఏర్పాటు, అధిక విద్యుత్ బిల్లులు, విద్యుత్ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ మహారాష్ట్రలో భారీ ఆందోళన జరిగింది. సెప్టెంబర్ 10న పాల్ఘర్ జిల్లా దహాను సమీపంలోని చరోటి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో 35 వేల మందికి పైగా ప్రజలు ముంబై–ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని, అధికంగా వస్తున్న విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా నిరసన కొనసాగించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపి, జిల్లాలో అధికంగా ఉన్న విద్యుత్ బిల్లులను తగ్గించే చర్యలు చేపడతామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 11 నుంచి అన్ని విద్యుత్ బోర్డు కార్యాలయాల్లో 15 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చిన అనంతరం ఆందోళన విరమించారు.
ఈ నిరసనలో థానే, పాల్ఘర్ జిల్లాలకు చెందిన ఎఐకెఎస్, సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ ధవాలే, కేంద్ర కమిటీ సభ్యుడు వినోద్ నికోలే, జిల్లా కార్యదర్శి కిరణ్ గహాలా, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు ప్రాచి హాతివ్లేకర్ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. ప్రజల ఐక్య పోరాటం ఫలితంగా విద్యుత్ బిల్లుల సమస్యపై అధికారుల నుంచి లిఖితపూర్వక హామీ లభించడం విజయంగా ఆందోళనకారులు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)