హైదరాబాద్ : హైదరాబాద్‌లో గణేశ్ ఆగమన్ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన ‘గణేశ్ ఆగమన్’ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో బద్రీనాథ్ (19) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో ‘శ్రీ గణపతి యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో వినాయక ఆగమన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు, యువకులు తరలివచ్చారు. అయితే, ఒక్కసారిగా జనం గుమిగూడటంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బద్రీనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ముషీరాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా బద్రీనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ రాంనగర్‌లోని గౌరీశంకర్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ, అబిడ్స్‌లోని మెథొడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నాడు.







కామెంట్‌లు (0)