- నిజాయితీకి నిలువటద్డం చంద్రబాబు
- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మూడేళ్ల కిందట సెప్టెంబరు 9వ తేదీన చంద్రబాబునాయుడును ఆనాటి వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులో నిర్బంధించిందని, కోర్టులు, ప్రజలు ఆయనకు అండగా నిలిచారని, చివరికి కడిగిన ముత్యంలా అక్రమ కేసుల నుంచి బయటపడ్డారని బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో కూటమి నాయకులు, మహిళలు కొవ్వొత్తులు వెలగించి ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబునాయుడు అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. అటువంటి నేతపై కక్షసాధింపులకు పాల్పడిన వైసిపికి ప్రజలు రాజకీయ సమాధి కట్టారన్నారు. తన అసమర్థ పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు చంద్రబాబుకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతను చూసి జగన్ ఓర్వలేకపోయారన్నారు. ఆనాడు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో 53 రోజులను బంధించారన్నారు. చివరికి కోర్టులు సైతం చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తీర్పునివ్వడంతో, జగన్ పెట్టిన తప్పుడు కేసుల నుంచి బాబు కడిగిన ముత్యంలా బయటకొచ్చారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న జగన్ తన మీడియాలో విషం కక్కుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)