- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్వతీపురం మన్యం జిల్లా, పెదపెంకి గ్రామంలో ప్రత్యేకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్రజల సౌకర్యానికి పెద్దపీట వేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రూ. 4.68 కోట్ల ఉపాధి హామీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, మండల పరిషత్, నీటిపారుదల శాఖ తదితర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యం ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదని, సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించే విధంగా ఉండాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత నిర్వహణా లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల్లో కూడా పారిశుధ్యం పట్ల అవగాహన కల్పిస్తూ, మార్పు తీసుకురావాలని చెప్పారు. ఏళ్ల తరబడి బోదకాలు వ్యాధితో బాధపడుతున్న పెదపెంకి గ్రామంలో పారిశుధ్య లోపాలు సరిచేయడంతో పాటు గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గ్రామంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అవసరమైన వాతావరణం కల్పించే దిశగా చేపట్టిన ఈ పనులు తుది దశకు చేరినట్టు అధికారులు తెలియజేశారు. గ్రామంలో రూ. 4.68 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో 27 అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణం, 12 సిమెంటు డ్రెయిన్లు, ఆరు డ్రెయిన్ కమ్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గ్రామంలో పూర్తి చేసిన అంతర్గత సిమెంటు రోడ్ల పొడుగు దాదాపు కిలోమీటరు ఉండగా, డ్రెయిన్లు కిలోమీటరున్నర వరకు ఉన్నాయి. మురుగు నివారణ, పారిశుధ్య చర్యల్లో భాగంగా నిర్మాణం చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్లు 48 పనులకు 41 నిర్మాణం పూర్తయినట్టు వివరించారు. గ్రామంలోని తెలగ వీధి, కొత్త వీధి, పెద్ద వీధి, చీకటి వీధి, పిలక వీధి, ఎన్‌టీఆర్ కాలనీ, మెయిన్ వీధి, ఎస్టీ కాలనీలలో నిర్మించిన సీసీ ఓపెన్ డ్రెయిన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు మురుగు నీటి సమస్యలను గణనీయంగా తగ్గించాయని, బంకూరు వీధి మరియు చీకటి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో ప్రజల రాకపోకలు సులభతరమయ్యాయని వెల్లడించారు. పూర్తయిన మ్యాజిక్ డ్రెయిన్ల పొడుగు రెండు కిలోమీటర్ల వరకు ఉంది. మరో 670 మీటర్లలో నిర్మిస్తున్న ఏడు మ్యాజిక్ డ్రెయిన్లు కూడా దాదాపు పూర్తి కావచ్చినట్టు తెలిపారు. దీంతోపాటు రోడ్లకు ఇరువైపులా కొబ్బరి చెట్లు, కోనేరు సుందరీకరణ తదితర పనుల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 3,000 వరకు మొక్కలు నాటినట్టు చెప్పారు.







కామెంట్‌లు (0)