బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిమిషాల వ్యవధిలో నవజాత శిశువుల మృతి

1 గంట క్రితం

Two newborns die within minutes of each other
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 07:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఘటన

  • వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణలు

  • ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ధర్నా

ప్రజాశక్తి - చిత్తూరు : చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నవజాత శిశువుల మృతితో విషాదం నెలకొంది. నిమిషాల వ్యవధిలో ఇద్దరు శిశువులు మృతి చెందడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డల మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. అయినప్పటికీ వైద్యశాల యాజమాన్యం తమ ఆందోళనను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృత శిశువులతో ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు.


తవణంపల్లి మండలం పొన్నేడుపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ ఈ నెల 16వ తేదీన తవణంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యం సరిగా లేదని అక్కడి వైద్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో శిశువును తిరుపతికి తీసుకెళ్లి రెండు రోజులపాటు చికిత్స అందించారు. అయినప్పటికీ చిన్నారి మృతి చెందింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సక్రమంగా వైద్యం అందించకపోవడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ శిశువు తల్లిదండ్రులు రాధమ్మ, పురుషోత్తంతోపాటు బంధువులు బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృత శిశువుతో ఆసుపత్రి నిర్వాహకులను నిలదీస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేవలం ట్రైనీ వైద్యులు, సిబ్బంది మాత్రమే చికిత్స అందించారని, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.


గుడిపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన సలోని, క్రీస్తు దంపతుల మగ శిశువు కూడా బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో మృతి చెందింది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు తమ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని, అరగంటలోపే శిశువు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపించారు. ఒకే రోజు ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందడంతో ఆసుపత్రిలో ఆందోళన నెలకొంది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్