- అర్ధాంతరంగా ముగిసిన కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ భేటీ
- ఈ ఏడాది తాగునీటికే కేటాయింపులు : కెఆర్‌ఎంబి
- సెప్టెంబర్ 4న మరోసారీ భేటీ కావాలని నిర్ణయం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) త్రిసభ్య కమిటీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజు అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్-ఇన్-చీఫ్‌లు (ఇఎన్‌సిలు) హాజరయ్యారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలపై బోర్టు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ సంవత్సరం మొత్తం నీటి వినియోగంపై తెలంగాణ ప్రతిపాదన చేయగా, అక్టోబర్ వరకు నీటి కేటాయింపులు చేయాలని ఎపి ప్రతిపాదించింది. తాగునీటికి 47 టిఎంసిలు కావాలని ఎపి కోరగా, మొత్తంగా 50:50 వాటాను నిర్ణయించాలని, తాగు నీటి కోసం వచ్చే ఆగస్టు వరకు 50 టిఎంసిలు కేటాయించాలని తెలంగాణ కోరింది. అయితే, నీటి వాటాలపై బోర్డు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలకు రెండు రాష్ర్టాలూ అంగీకరించాయి. ఈ ఏడాది కాలానికి సంబంధించి నీటి వాటాల విషయం తేలకపోవడంతో సెప్టెంబర్ నాలుగున మరోసారీ భేటీ కావాలని బోర్డు నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఈ ఏడాదికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ఈ నెలాఖరులోపు సమర్పించాలని బోర్డు సూచించింది. మొత్తం టిఎంసిలు, ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని టిఎంసిలు వాడుకుంటారు తదితర వివరాలను అందించాలని కోరింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖల ఇఎన్‌సిలు హాజరవ్వాలని ఆదేశించింది.
నీటి వాటాలపై చర్చించలేదు : ఎపి ఇఎన్‌సి నరసింహమూర్తి
కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ర్టాల నీటి వాటాలపై చర్చించలేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల తాగునీటి ప్రాధాన్యతపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఏడాది మొత్తం నీటి వినియోగానికి సంబంధించిన నివేదికను తెలంగాణ అందించగా, ఎపి మాత్రం అక్టోబర్ నెల వరకు అవసరమైన నీటి పంపిణీకి ప్రతిపాదనలు పెట్టింది. రాబోయే కాలానికి సంబంధించి 47 టిఎంసిల నీటిని కేటాయించాలని మేము కోరగా, దానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 22 టిఎంసిల నీటి వినియోగానికి తెలంగాణ సమ్మతించింది. మొత్తం కృష్ణా నీటి వాటాను గతంలో మాదిరిగానే 66:34 రేషియోగా పంపిణీ చేయాలని బోర్డును కోరాం.
50 టిఎంసిలు కేటాయించాలి : తెలంగాణ ఇఎన్‌సి రమేశ్‌బాబు
తెలంగాణ తాగు నీటి అవసరాలకు కృష్ణా నది నుంచి 50 టిఎంసిలు కేటాయించాలి. శ్రీశైలం నుంచి పది టిఎంసిలు, నాగార్జున సాగర్ నుంచి 40 టిఎంసిలు వాడుకుంటాం. ఈ ఏడాది మొత్తంగా కృష్ణా నది జలాల పంపిణీ 50:50 రేషియో ప్రాతిపదికన చేపట్టాలి. ఎపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా చేపడుతున్న నీటి వాడకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఎపి ఇప్పటికే తమ వాటా కంటే అదనంగా పది టిఎంసిల నీటిని వాడుకుంది. సెప్టెంబర్ నాలుగున జరిగే బోర్డు సమావేశంలో తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చ ఉంటుంది. భవిష్యత్తులో ప్రవాహాలు వస్తే తదుపరి ఆలోచిస్తాం.








కామెంట్‌లు (0)