- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణాలపై విధిస్తున్న వివిధ సేవా ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించిందని ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఎస్‌హెచ్‌జి సభ్యులకు ఇచ్చే రుణాలపై విధిస్తున్న సేవా ఛార్జీలు అదనపు భారంగా మారుతున్నాయని ప్రస్తావించి, వాటిని మాఫీ చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి, సీఈవో వాకాటి కరుణ బ్యాంకర్లను నిరంతరం సంప్రదిస్తూ జరిపినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌హెచ్‌జిల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేయగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కూడా గత నెల1 నుంచి అన్ని శాఖల్లో ఎస్‌హెచ్‌జిల రుణాలపై ఎలాంటి సేవా ఛార్జీలు వసూలు చేయరాదని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో గతంలో వసూలు చేసిన 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో పాటు డాక్యుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్, లెడ్జర్ ఫోలియో, పాస్‌బుక్ అప్‌డేషన్, ఎస్‌హెచ్‌జి, విఒ స్టేట్‌మెంట్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా పూర్తిగా రద్దు కానున్నాయని చెప్పారు. ఈ నిర్ణయంపై ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి అవగాహన కల్పించాలని సూచించారు.








కామెంట్‌లు (0)