సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆగస్టు 14న పోలవరం ఎడమ కాల్వకు నీళ్లు

4 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 12:02 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • అనకాపల్లి వద్ద నేనే అఖండ హారతి ఇస్తా

  • 2027 మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి

  • సెప్టెంబర్‌ 1న వెలిగొండ మొదటి దశ ప్రారంభం

  • 36 సాగునీటి ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక

  • నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తాం : పోలవరం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • ​కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన

​ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, అమలాపురం, ఆత్రేయపురం : ఆగస్టు 14న పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేస్తామని, అనకాపల్లి వద్ద అఖండ హారతి ఇస్తానని సిఎం చంద్రబాబు ప్రకటించారు. గోదావరి డెల్టా శివారు ఆయకట్టు భూములకూ సాగు నీరందేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు పోలవరం చేరుకున్న చంద్రబాబు గంటన్నరపాటు సిఆర్‌ఎఫ్‌ ‌డ్యామ్‌ ను, పవర్‌ ‌హౌస్‌ ‌ను, గ్యాప్‌ -1, గ్యాప్‌-2 పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌‌ను తిలకించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాలుగున్నర గంటలకు గెస్టుహౌస్‌‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రెండు దశలు పూర్తయితే 194 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందన్నారు. మరో రెండొందల టిఎంసిల వరద జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తిజరగనుందని వివరించారు. జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత తనపై ఉందని, ఇప్పటి వరకూ రెండేళ్లలో రూ.2,800 కోట్లు నిర్వాసితులకు ఖర్చు పెట్టామని, మరో రూ.2,200 కోట్లు పరిహారం కింద ఇవ్వాల్సి ఉందని తెలిపారు. స్థలం సొంతంగా కొనుగోలు చేసుకున్న వారికి రూ.రెండు లక్షలు అదనంగా ఇస్తున్నామన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకూ 37 సార్లు పోలవరం వచ్చానని, 136 సార్లు సమీక్ష జరిపానని, కేంద్రంతో అనేకసార్లు మాట్లాడానని వివరించారు. 89 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2027 మార్చికి అన్ని పనులూ పూర్తి చేసి వర్షాలు కురిసిన తర్వాత నీళ్లు వదులుతామన్నారు. ఫేజ్‌-2 పనులు తర్వాత ప్రారంభిస్తామని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌‌కు వెలిగొండ మొదటి దశ పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. పెండింగ్‌‌లో ఉన్న 36 ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం లిఫ్ట్‌ ఇరిగేషన్‌‌ను అటకెక్కించిందని చంద్రబాబు విమర్శించారు. అవసరమైతే అవుట్‌‌సోర్సింగ్‌ ‌పద్ధతిలోనైనా వీటిని పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ఎంఎల్‌ఎలు, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రైతులతో ముఖాముఖి

కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ నిర్మాణం గోదావరి డెల్టా ప్రాంతంలో సామాజిక, ఆర్థికాభివృద్ధిలో కీలక మలుపు తెచ్చిందన్నారు. 2014-19 తన హయాంలో ఈ బ్యారేజీకి 54 కొత్త గేట్లను ఏర్పాటు చేయించామని తెలిపారు. ప్రస్తుతం మరో 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో 25 శాతం వర్షపాతం తక్కువ పడిందని, నదుల్లోకి నీళ్లు రావట్లేదని, వాతావరణ పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని దానికి అనుగణంగా వ్యవహరించాలని సూచించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక ప్రాంతాల్లో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కోనసీమకు రైల్వే లైన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గోదావరి డెల్టా సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఎల్ఎ బండారు సత్యానందరావు ముఖ్యమంత్రికి నాగలి, చర్నాకోలాను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు హెలికాప్టర్లో వెళ్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. తొలుత తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి ఆయన రోడ్డు మార్గం గుండా కాటన్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాటన్ బ్యారేజీని పరిశీలించారు. గోదావరి జలాలపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ​మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్, ఎంఎల్ఎలు బండారు సత్యానందరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తదతరుల పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్