ముఖ్యమంత్రికి మాజీ సిఎం జగన్ సవాల్
లోకేష్ రాజీనామా చేయాల్సిందే
గ్రూప్ -1కు టిడిపి హయాంలోనే ప్రిలిమ్స్ పూర్తయ్యాయి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిపిఎస్‌సి, డిఎస్‌సిపై సిబిఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కూడా అందుకు ముందుకు రావాలని మాజీ సిఎం జగన్ అన్నారు. డిఎస్‌సిలో అవినీతి జరిగినట్లు రుజువైందని, కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏదేదో చెబుతున్నారని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్‌సికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. గ్రూప్ -1కు టిడిపి హయాంలోనే ప్రిలిమ్స్ పూర్తయ్యాయని, తాము మెయిన్స్ మాత్రమే నిర్వహించామని అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. డిఎస్‌సి విషయంలో లీకేజీ, అక్రమాలపై ఇప్పటివరకూ ఏ అంశాలైతే ప్రజలముందు ఉంచామో, అవన్నీ వాస్తవవేమని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చిందని అన్నారు. తప్పు చేశారు కాబట్టి, గింజుకుంటారే తప్ప, సిబిఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇవన్నీ అసెంబ్లీలో లేవనెత్తుతామనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడంలేదని తెలిపారు. డిఎస్‌సి లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీలు స్తంభింపచేసినా అక్కడ చర్చకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. డిఎస్‌సిలో తప్పులు జరిగాయి కనుకే సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. డిఎస్‌సి పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారని, స్కాం ఇక్కడ నుంచే మొదలుపెట్టార్నది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. వైసిపి లేవనెత్తిన కీలక అంశం కూడా ఇదేనని పేర్కొన్నారు. డిఎస్‌సి ప్రశ్నా పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ‘నవీన్‌కు’, ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేమని ప్రభుత్వం ఒప్పుకుందని, మరి నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు క్యాండెట్ రాలేదని, అందువల్లే పోస్ట్ ఇవ్వలేదని చెబుతున్నారని, ఇదే విషయాన్ని కోర్టులో కూడా ఫైల్ చేశారని వివరించారు. అతని ఐడీని బ్లాక్‌చేసి, కాల్‌లెటర్ పంపనప్పుడు, నవీన్ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడో చెప్పాలన్నారు. అతనికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది గనుకనే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చి, పక్కనపెట్టేశారని అన్నారు. మరోవైపు అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌కోటాలో పోస్టులు ఇచ్చారని, దీనికోసం జీవోలు జారీచేశారని అన్నారు. క్రీడాకారులకు టెస్టులు అవసరం లేదని, పివి సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువుచెప్పే ఈ టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెబుతుండటం హాస్యంగా ఉందన్నారు. అంతర్జాతీయ మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రత్యేక పాలసీ ఉందని, ఆ మేరకు కేబినెట్ నిర్ణయాలు తీసుకుని వారికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణిని, స్థానిక కోటా వారిని ఒకేగాటన కట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లుతుందని తెలిపారు. టీచర్ రిక్రూట్‌మెంట్లో స్పోర్ట్స్‌కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని,చెబుతూ మళ్లీ వాటిని ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన, ఎస్‌టి అభ్యర్థి దుర్గారావుకు కూడా కాల్ పంపిన తర్వాత కూడా, పోస్టు ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న “సాఫ్ట్‌బాల్’’ అసోసియేషన్ నుంచి, లోకేష్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న “జూడో అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఏకంగా 372 పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. వీరెవరూ డిఎస్‌సి పరీక్ష రాయలేదని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అదే ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న సిఎంకు, లోకేష్‌కు ఎందుకు ఇది వర్తించడం లేదని ప్రశ్నించారు. కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు 2018- ఎపిపిఎస్‌సి గ్రూప్-1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడని అన్నారు. దీనిపై ఇప్పటికి రెండు సిట్లు వేశారని తెలిపారు. కోవిడ్ వల్ల డిజిటల్ వాల్యుయేషన్ చేసినా కోర్టు సూచనల మేరకు పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. గ్రూప్-1 వాల్యూషన్ హాయ్‌లాండ్‌లో జరగలేదని అధికారిక ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, అయినా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 15న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఇదే విషయాన్ని రాశారని పేర్కొన్నారు. టిడిపి హయాంలో జరిగిన ఎపిపిఎస్‌సి ఫలితాలకు సంబంధించి రిటన్ టెస్టు, ఇంటర్వ్యలకు ఎన్ని మార్కులు వచ్చాయో బయటపెడితే అసలు విషయం ప్రజలకు తెలుస్తుందని అన్నారు. ఎపిపిఎస్‌సి విషయంలో తాము తప్పు చేయలేదని, అందుకనే విచారణకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ కోరాలని జగన్ డిమాండు చేశారు.





కామెంట్‌లు (0)