31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా
‘విభజన’ సమస్యల పరిష్కరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి
డిలిమిటేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలి : సిఎం విజయ్
ఇతర రాష్ట్రాల అవసరాలనూ కర్ణాటక గుర్తింస్తుంది : డికె శివకుమార్
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలు ఉత్తమ సాంప్రదాయాలు నెలకొల్పాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో (మామల్లపురం) 31వ దక్షిణాది మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశం అమిత్ షా అధ్యక్షత గురువారం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు అంతర్రాష్ట్ర వివాదాలు, భద్రతా అంశాలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సముద్ర తీర వినియోగంలో సాంకేతిక నైపుణ్యం. ఈ మూడు అంశాలే దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి మూల స్తంభాలుగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, దక్షిణాది ప్రజలు, ఇక్కడి ప్రభుత్వాలు ఆవిష్కరణలు, ఆదాయ సమీకరణ రంగాల్లో అనేక ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పాయని పేర్కొన్నారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, అమిత్ షా రాక సందర్భంగా స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సమాఖ్య విధానమే దేశానికి పునాదన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలు చర్చలు, చట్టబద్ధ విధానాలతో పరిష్కరించుకోవాలన్నారు. అంతేకా కుండా డిలిమిటేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టి రేట్ల నిర్ణయాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఇదే సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘‘నీటి వనరులు మనల్ని విభజించకూడదు, ఏకం చేయాలి. నీటి పంపిణీ నుండి నీటి సహకారానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సహకారం ఎలా ఉంటుందో కర్ణాటక చూపించింది,’’ అని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ల మధ్య గతంలో జరిగిన చర్చలను శివకుమార్ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల సమంజసమైన అవసరాలను కర్ణాటక గుర్తిస్తుందని, దీనికి పరస్పరం సహాకారం ఉండాలన్నారు.
కేంద్ర నిర్ణయం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూపు : సిఎం చంద్రబాబు
ఈ సమావేశంలో సిఎం చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను చంద్రబాబు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తికాలేదని పేర్కొన్నారు. ఆస్తులు, అప్పులు, సంస్థల విషయంలో సమ న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66 కింద ఉన్న అంశాలపై కేంద్ర నిర్ణయం కోసం గడచిన 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 56లోని సమస్యలు, వనరుల లోటు, ఆర్థిక భారానికి సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఎపి అభివృద్ధిలో కేంద్రం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమన్నారు.. చట్టంలోని షెడ్యూల్–13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సిఎం కోరారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, మూడు విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రాజధానికి రైలు అనుసంధానం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. దుగరాజపట్నం పోర్టు, బిపిసిఎల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందాల్ స్టీల్ కు రైలు అనుసంధానంపై అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
కుప్పం మీదుగా బుల్లెట్ రైలుకు ప్రతిపాదన..
ఎపి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు, ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానించాలని చంద్రబాబు సూచించారు. దీనికి సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా ప్రస్తుతం 31 శాతంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. అలాగే, భవిష్యత్ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని చంద్రబాబు పేర్కొన్నారు. అదేవిదంగా గంగా–కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి, మిగులు జలాలను దక్షిణాదికి తరలించాలన్నారు. అలాగే కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు త్వరితగతిన అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దక్షిణాది ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్లతో సహా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.





కామెంట్‌లు (0)