గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యార్థులపై ఒత్తిడి పడరాదు

1 గంట క్రితం

cbse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 02:20 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • త్రిభాషా విధానం అమలుపై సుప్రీంకోర్టు హితవు

న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులకు మూడు భాషల విధానం అమలుపై సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. సిబిఎస్‌ఇ త్రిభాషా విధానం వల్ల విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకూడదని పేర్కొంది. 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలను అభ్యసించడాన్ని తప్పనిసరి చేస్తూ సిబిఎస్‌ఇ తీసుకొచ్చిన ఈ విధానం వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టడంలో తప్పు లేదని, అయితే దానిని అమలు చేస్తున్న తీరుపైనే పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. ఈ మేరకు సిజెఐ జస్టిస్ సూర్య కాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

‘త్రిభాషా విధానంపై విద్యార్థులకు ఉన్న సమస్యలలో కొన్నింటిని పునఃపరిశీలించాలి. ఎప్పటికైనా త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిందేనన్న విషయంలో సందేహం లేదు. తప్పు కూడా ఏమీ లేదు. కానీ త్రిభాషా విధానం అమలులో ఎదురవుతున్న ఆటంకాలు, సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంపై దృష్టి సారించాలి. అందుబాటులో ఉన్న భాషా ఎంపికలకు సంబంధించి తగిన మానవ వనరుల వ్యవస్థను ఎలా నిర్మించాలనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలలో ఒకటి. ఒకవేళ ఆరో తరగతిని త్రిభాషా విధానానికి ప్రారంభ దశగా ఎంచుకున్నట్లయితే ఈ ఏడాది ఆరో క్లాస్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలి. వచ్చే ఏడాది నుంచి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా ఈ విధానాన్ని అసలు 6వ తరగతి నుంచి ప్రారంభించాలా? లేక ప్రాథమిక స్థాయిలోనే 3 లేదా 4వ తరగతి నుంచే అమలు చేయాలా? అనే విషయాన్ని కూడా పునరాలోచించాలి’ అని కేంద్రం తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య

భాటికు ధర్మాసనం తెలిపింది. కేంద్రం ప్రభుత్వం తరపున, సిబిఎస్‌ఇతో పాటు ఇతర విద్యా బోర్డులలో ఏం జరుగుతుందో కూడా మీరు (కేంద్రం తరఫున వాదిస్తున్న ఇశ్వర్య భాటినుద్దేశించి) గమనించాలని కోరింది. సిబిఎస్‌ఇ త్రిభాషా విధానం అమలు సముచితంగా జరిగేలా చూసుకోవాలని సూచించింది. ఈ విషయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పడాలని తాము కోరుకోవడం లేదన్నారు. జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు రెండు భారతీయ భాషలతో సహా మొత్తం మూడు భాషలను తప్పనిసరిగా అభ్యసించాలన్న సిబిఎస్‌ఇ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ ప్రారంభంలో కొంతమంది పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం మూడు భాషలకు సంబంధించినదని, తమ ఆందోళన ప్రధానంగా ఆరో తరగతి విద్యార్థుల గురించేనని ధర్మాసనానికి తెలిపారు. 6- 8వ తరగతుల వరకు పాఠ్యప్రణాళికను రూపొందించే అధికారం లేదా పరిధి సిబిఎస్‌ఇకి లేదని, ఆ బాధ్యత ఎన్‌సిఇఆర్‌టికి ఉంటుందని పేర్కొన్నారు. త్రిభాష బోధన కోసం అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండాలని గ్రోవర్ అన్నారు.

​అన్ని భాషలను గౌరవించాల్సిందే..

సిబిఎస్‌ఇ ఏదైనా భాషను ప్రవేశపెడుతున్నట్లయితే ఉపాధ్యాయుల కోసం కూడా ప్రణాళిక కలిగి ఉండాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అది వారి బాధ్యతే అని తేల్చి చెప్పింది. పాఠశాలలు తప్పులు చేస్తే వాటిని నిలదీస్తామని, సిబిఎస్‌ఇ 23 భాషల ఎంపిక అవకాశాలను కల్పించిందని పేర్కొంటూ.. ప్రాంతీయ భాషల పట్ల ఎలాంటి న్యూనతా భావం ఉండకూడదని తేల్చి చెప్పింది. ఇతర భాషల మాదిరిగానే ఈ భాషలన్నింటినీ గౌరవించాలని హితవు పలికింది. త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సందేహాలు కలగడం సహజమని, కానీ త్రిభాషా విధానం అమలులో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు సిఫార్సులు చేయడానికి, పరిష్కారాలను కనుగొనడానికి తాము ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, లేదంటే ప్రభుత్వాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేయమని కోరుతామని ధర్మాసనం పేర్కొంది.

భాష అనేది ఒక సంస్కృతికి వాహకం : అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య

ఈ వ్యాఖ్యలకు కేంద్రం తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి బదులిచ్చారు. తాము విద్యార్థులకు సాధ్యమైనంత మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో వేలాది మంది నిపుణులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. "దేశంలోని విద్యా బోర్డులలో సిబిఎస్‌ ఒకటి. మొత్తం 7.5 లక్షల పాఠశాలల్లో సుమారు 33,000 స్కూల్స్ దీని పరిధిలో ఉన్నాయి. దేశంలోని పాఠశాలల్లో సుమారు 4.45 శాతం సిబిఎస్‌ఇ పాఠశాలలే. వీటిలో 99.19 శాతం పాఠశాలలు ఇప్పటికే రెండు స్థానిక భాషల విధానాన్ని పాటిస్తున్నాయి. భాష అనేది ఒక సంస్కృతికి వాహకం." అని ఐశ్వర్య పేర్కొన్నారు.

‘స్థానిక భాష’ పదంపై జస్టిస్‌ బాగ్చీ అభ్యంతరం

కాగా వాదనల సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్ ఐశ్వర్య భాటి ‘స్థానిక’ (నేటివ్‌) భాష అనే పదాన్ని వాడటం పట్ల న్యాయమూర్తి జస్టిస్‌ బాగ్చీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇలాంటి వలసవాద ఛాయలున్న పదాలను సరి చేసుకోవాలని, నూతన విద్యా విధానంలోనూ ఇలాంటి పదాలను సరి చేయాలని సూచించారు. ‘స్థానిక’ పదంలో వలసవాద ఛాయలు ఉన్నాయని, అందుకు బదులుగా దేశీయ (ఇండిజీనియస్‌) అనే పదాన్ని వాడాలని సూచించారు. విధాన రూపకర్తలు తాము ఉపయోగించిన పదాల పట్ల స్పృహతో ఉండాలని హితవు పలికారు. అలాగే ఇంగ్లీష్‌ను దేశీయ (ఇండిజీనియస్‌)గా పరిగణించాలా? విదేశీ భాష (నాన్‌ ఇండిజీనియస్‌)గా పరిగణించాలా? అనేది కూడా ఒక ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్