గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుల నిర్మూలన కోసం పోరాడాలి

15 గంటల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పిలుపు

ప్రజాశక్తి- యంత్రాంగం : కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని దళిత్‌ ‌శోషణ్‌ ‌ముక్తి మంచ్‌ ‌జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు అన్నారు. కుల నిర్మూలనతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ‘సామాజిక శంఖారావం’ పేరుతో నెల్లూరు, పల్నాడు,మార్కాపురం శ్రీకాకుళంలో సదస్సు, వర్క్‌‌షాపులు బుధవారం జరిగాయి. నెల్లూరులో శ్రీనివాసరావు మాట్లాడుతూ వివక్షకు గురవుతున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దళిత క్రిస్టియన్లు కూడా సమాజంలో అన్ని రకాలుగా వివక్ష ఎదుర్కుంటున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి తదితర సంఘ్‌‌పరివార్‌ ‌సంస్థలు వారికి రిజర్వేషన్లు వద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి మతోన్మాద సంస్థలను ఎదుర్కోకుండా కుల నిర్మూలన సాధ్యం కాదని అన్నారు.

మార్కాపురంలో నిర్వహించిన సదస్సులో కెవిపిఎస్‌ ‌రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పెరియార్, శ్రీ నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్యల స్ఫూర్తితో దళితుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అధ్యయన యాత్రలు, ఆందోళనలు, ప్రత్యక్ష కార్యాచరణల ద్వారా "సామాజిక శంఖారావం"ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కులవ్యవస్థను బలోపేతం చేస్తోందని విమర్శించారు.

శ్రీకాకుళంలో నిర్వహించిన వర్క్‌‌షాపులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ..రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పాలకులు సైతం దళితులపై వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైసిపి హయాంలో, నేడు టిడిపి కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై నిరంతరం దాడులు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సమాజంలో ప్రస్తుతం కొనసాగుతున్న కులవివక్ష ప్రమాదకరమని, అభివృద్ధికి ఆటంకమని రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మర్రాపు సూర్యనారాయణ తెలిపారు. దళితులను ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక సమస్యలూ పట్టిపీడుస్తున్నాయని రైతుసంఘం పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.తులసీదాస్ అన్నారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నిర్వహించిన వర్క్‌‌షాపులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య మాట్లాడుతూ... హోటళ్లు, పంచాయతీ అరుగులు, బహిరంగ ప్రదేశాలు, సామూహిక భోజనాల్లో దళితులను సమానంగా కూర్చోనివ్వకపోవడం, దళితుల పెళ్లి ఊరేగింపులను అగ్రవర్ణ వీధుల్లో అనుమతించకపోవడం, దళిత ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడం, కులాంతర వివాహాలు చేసుకున్న వారిని వెలివేయడం, ఉపాధి హామీ పనుల్లో వివక్ష చూపడం వంటి అనేక రూపాల్లో సామాజిక వివక్ష కొనసాగుతోందని వివరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి.శివనాగరాణి మాట్లాడుతూ.. దళితులు ఇప్పటికీ సుమారు 15 రకాల వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్