- మంత్రి కందుల దుర్గేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆతిథ్య రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రిని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్, ఎపి స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి ఆతిథ్య రంగానికి కేంద్రం అమలు చేస్తున్న జిఎస్టి సంస్కరణలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా.. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం అమలులో ఉన్న 18 శాతం జిఎస్టిని 5 శాతంకు తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఙప్తి చేశారు. వాణిజ్య ఎల్‌పిజి వినియోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగిస్తున్న సంస్థలతో పోలిస్తే అధిక నిర్వహణ వ్యయాన్ని భరిస్తున్నాయని, దీంతో వ్యాపార నిర్వహణలో అసమానతలు ఏర్పడుతున్నాయని వివరించారు. జూలై 14న టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్, చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్, అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆంధ్ర డొమెస్టిక్, ఇన్‌బౌండ్ టూరిజం సంయుక్తంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని బెర్మ్ పార్క్ హరిత రిసార్ట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ ఏజెంట్స్ మీట్, ఇన్‌బౌండ్ టూరిజం కాన్‌క్లేవ్’కు మంత్రి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)