రోజురోజుకూ పోరాటం ఉధృతమవుతుండటంతో దిగొచ్చిన ప్రభుత్వం
మూడో రోజూ తీవ్ర ఉద్రిక్తత
50 మందికిపైగా అరెస్టు
ప్రజాశక్తి - మధురవాడ, అనందపురం (విశాఖపట్నం) : విశాఖలోని మారికవలస గిరిజన గురుకుల బాలురు ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కొనసాగించాలంటూ సాగుతున్న పోరాటం రోజురోజుకూ ఉధృతమవుతుండటంతో మంగళవారం సాయంత్రానికి ప్రభుత్వం దిగొచ్చింది. పాఠశాల మూసివేతను నిరసిస్తూ తొలి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటం నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ ముందుకు సాగింది. మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. ఈ క్రమంలో 50 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి పిఎం.పాలెం, ఆనందపురం తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు, సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన విశాఖ, అల్లూరి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుదకు సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.గౌతమి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గిరిజన గురుకుల బాలురు ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇక్కడే కొనసాగుతాయని తెలిపారు. పాఠశాల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వక దరఖాస్తులు అందజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద లక్ష్యంతో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసిందని, అమలు చేయడంలో చిన్నపాటి తప్పులు దొర్లాయని అన్నారు. గౌతమి మాట్లాడుతూ... భవిష్యత్తులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రోజంతా టెన్షన్ వాతావరణం
మారికవలస గురుకుల పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచిన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.అజయ్, నాయకులు ఎం.నరేష్, ఎస్.తులసి, వి.హృదయ, డిఎల్‌ఒ కేంద్ర కన్వీనర్ పెలమాల రంజిత్ కుమార్, డిఎస్‌ఒ నాయకులు కె. కొత్తయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, జెడ్‌పి చైర్‌పర్సన్ జె.సుభద్ర, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చింతలపూడి వెంకటరామయ్య సహా పలువురు వైసిపి నేతలను అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆనందపురం పోలీస్ స్టేషన్ వద్ద గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర మాట్లాడుతూ.. మారికవలస గిరిజన గురుకులాన్ని కొనసాగించాల్సిందేనన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట విద్యను ఫిజిక్స్‌వాలా వంటి ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించడం తగదన్నారు.
గిరిజన విద్యార్థులకు మద్దతుగా నిలిచిన సిపిఎం
గిరిజన విద్యార్థులకు సిపిఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అన్నారు. మారికవలస గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు తలపెట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఎంతోమందికి నాణ్యమైన విద్యను అందించిన గురుకులాన్ని మూసివేస్తామనడం తగదన్నారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలూ కల్పించి ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, నాయకులు డాక్టర్ బి.గంగారావు, పి.మణి పాల్గొన్నారు.
సంఘటిత విజయం : అప్పలనర్స
మారికవలస బాలుర గురుకుల పాఠశాలను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని పోరాటాల సంఘటిత విజయంగా ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స పేర్కొన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు ఇక్కడే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)