- ఢిల్లీతో నిత్యం మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్రం తొలుత మంజూరు చేసిన నిధులకు (మదర్ శాంక్షన్స్)... తరువాత వచ్చే నిధులకు పొంతన కనిపించడం లేదు. దీనివల్ల రాష్ట్రంలో ఆర్ధిక నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ తరహా నిధులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బావిస్తోంది. కేంద్రం తొలుత మంజూరు చేసిన నిధులను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేయాలని కీలక శాఖల అధికారులకు సూచనలు వెళ్లాయి.
ఇళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, పలు సంక్షేమ పథకాలకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రం తొలుత మంజూరు చేస్తుంది. దీనినే ‘మదర్ శాంక్షన్’ అని సాంకేతికంగా పిలుస్తారు. ఆ తరువాత ఆ మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ మదర్ శాంక్షన్స్కు ఆ తరువాత విడుదలవుతున్న నిధులకు పొంతన కనపడటం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సి న ఆర్ధిక సంఘం నిధులు, విద్య, ఆరోగ్యం, పేదలకు గృహాలు, మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలకు కేంద్రం తొలుత చూపుతున్న కేటాయింపులకు, ఆ తరువాత విడుదల చేస్తున్న మొత్తానికి సంబంధం ఉండటం లేదు. అదే సమయంలో అరకొరగా విడుదలవుతున్న మొత్తాన్ని కూడా రాష్ట్ర అధికారులు ఖర్చు చేయడం లేదని చెబుతున్నారు. దీనిని సాకుగా చూపి కేంద్రం నిధులు విడుదలచేయడం లేదు. మొత్తంమీద, కేంద్రం సాచివేత ధోరణి, రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం కలిపి ప్రజలకు శాపంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ తరహా నిధులకు సంబంధించిన వినియోగ పత్రాలను తక్షణం ఢిల్లీకి పంపాలని, అదే సమయంలో కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాబట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ‘ఢిల్లీతో నిత్యం టచ్లో ఉండాలి’ అని ఉన్నతాధికారులకు సూచించారు. అధికారుల స్థాయిలో చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తక్షణం చేయాలని, వారి స్థాయిల్ కష్టం అనుకున్న వాటి వివరాలు తనకు అందజేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.








కామెంట్లు (0)