మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకరువుతో బతుకులు భారమైతే.. కంపెనీలకు భూములా?

54 నిమిషాల క్రితం

image-cmucs7oh93jaz0jmvx005jsn3.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నెల్లూరు, అల్లూరిలో ఎల్‌‌నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సిపిఎం బృందం

  • పంటలు పోయాయి..అప్పులే మిగిలాయని రైతుల ఆవేదన

ప్రజాశక్తి- యంత్రాంగం : ​ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో చుక్క నీరు లేక కరువు తాండవిస్తుంటే.. మరోవైపు పాలకులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు భూములను కట్టబెడుతూ ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని సిపిఎం బృందం విమర్శించింది. ఎల్ నినో ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలను మంగళవారం సిపిఎం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి, కరువు కోరల్లో చిక్కుకున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది.

నెల్లూరులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం నేతృత్వంలో సోమశిల, అనంతసాగరం, మర్రిపాడు, ఉదయగిరి ప్రాంతాల్లో బృందం పర్యటించింది. ఉదయగిరి మండలంలోని నేలటూరు గ్రామస్తులు మాట్లాడుతూ... తాము పశువులను నమ్ముకుని, మెట్ట పంటలు పండించుకుంటూ జీవిస్తున్నామని, తమ గ్రామానికి పాడిపంటే ప్రధాన జీవనాధారమని పేర్కొన్నారు. గ్రామంలో పాడి పశువులు అధికంగా ఉన్నాయని.. వాటి మేతకు ఆధారమైన పోరంబోకు, కొండ భూములను రిలయన్స్ సంస్థకు అప్పగించడం వల్ల పశువులకు మేత కరువై, తమ కుటుంబ పోషణ రోడ్డున పడుతుందని సిపిఎం బృందం ఎదుట వాపోయారు. దీనికి తోడు, ఇతర పంచాయతీల పరిధిలోని తమ పశువుల మేత భూములను సైతం మిలటరీ పేరు చెప్పి పది ఎకరాల వరకూ అప్పగించారని, ఈ భూములను రిలయన్స్ సంస్థకు కట్టబెడితే గ్రామం జీవనాధారం కోల్పోయి, ఊరంతా ఖాళీ చేసి వలస పోవాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకనాథం, జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ ‌మాట్లాడుతూ...గ్రామాల్లో వర్షాధార పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయని, తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ బృందంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్ రావు, జిల్లా కౌలు రైతు సంఘ నాయకులు తుళ్లూరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

‘అల్లూరి’ని కరువు జిల్లాగా ప్రకటించాలి

‘వర్షాభావం మా ఆశలను ఆవిరి చేసింది. మాకున్న కొద్దిపాటి భూమిలో సగం కూడా సాగు చేసుకోలేకపోయాం. ఎలాగోలా సాగు చేసినా తగిన వర్షాల్లేక పంటలు ఎండిపోయాయి. ఏం తిని బతకాలో అర్థం కావడం లేదు’ అని అల్లూరి జిల్లా పాడేరు మండలం దుమ్మపుట్టు, వల్లపురం గ్రామాల రైతులు సిపిఎం బృందం ఎదుట తమ గోడు వెల్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం నేతృత్వంలో రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు, ఎం సూర్యనారాయణ, కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి పి అప్పలనర్స తదితరులతో కూడిన బృందం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకులోయ మండలాల్లోని దుమ్మపుట్టు, వల్లపురం, రవ్వలగూడ, పానిరంగిని,ఆర్ డుంబ్రిగుడ గ్రామాల్లో పర్యటించింది. ఎండిపోయిన వరి, ఇతర పంటలను నాయకులు పరిశీలించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులతో మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, ఉపాధి హామీ పనులు, పోడు భూముల పరిస్థితిపై వివరాలు సేకరించారు. బలరాం మాట్లాడుతూ అల్లూరి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. సీతాఫలాలు, సీకాయ, కరక్కాయ, చింతపండు వంటి అటవీ ఉత్పత్తుల్లో ఈసారి దిగుబడి రాలేదన్నారు. ఏజెన్సీలో వ్యవసాయ భూములకు లిఫ్ట్ ఇరిగేషన్, చెక్‌‌డ్యామ్‌‌లను నిర్మాణం చేయడంలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు తీవ్రంగా విఫలమయ్యాయన్నారు. ఈ పర్యటనలో పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు లక్కు, సుందరరావు, దాస్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్