మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించండి

52 నిమిషాల క్రితం

M A Baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అమెరికా ఆంక్షల చట్టాన్ని తిరస్కరించండి

  • కేంద్రానికి సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి విస్తృత అధికారాలు కల్పించే నూతన అమెరికా ఆంక్షల చట్టాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ, ఏ దేశం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించే హక్కును తానే దక్కించుకోవాలని అమెరికా చూస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇతర దేశాల విదేశాంగ, ఆర్థిక విధానాలను నిర్దేశించే ఈ చట్టం, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమేనని, దీనిని సహించబోమని స్పష్టం చేసింది.

భారత్‌పై తీవ్ర ప్రభావం..

ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత్, రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నందున అమెరికా లక్ష్యంగా చేసుకున్న దేశాలలో ఒకటిగా ఉందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ ఏడాది జులై నాటికి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురులో 51 శాతానికి పైగా రష్యా నుంచే వస్తోంది. చమురు సరఫరాలకు ఏదైనా బలవంతపు అంతరాయం ఏర్పడినా, లేదా ఖరీదైన పునర్‌వ్యవస్థీకరణ చేయాల్సి వచ్చినా, అది ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, సామాన్య ప్రజల జీవనోపాధిపై దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది.

ఇరాన్ నుంచి వచ్చే దిగుమతులకు ఇప్పటికే అంతరాయం ఏర్పడిన విషయాన్ని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది.

అమెరికా బెదిరింపులకు లొంగడం మానుకోవాలి..

అమెరికాను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూడటాన్ని, అమెరికా సామ్రాజ్యవాద బెదిరింపు ఎత్తుగడలకు లొంగిపోవడాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మానుకోవాలని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.

జి-20 వాణిజ్య మంత్రుల సమావేశం కోసం అమెరికాలో పర్యటించనున్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఈ సందర్భంగా భారత్ వాదనను గట్టిగా వినిపించి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మన ఆర్థిక, విదేశాంగ విధాన నిర్ణయాలను అమెరికా నిర్దేశించేలా అనుమతించకూడదని పొలిట్‌బ్యూరో స్పష్టంగా పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్