- విద్యుత్ బిల్ కలెక్టర్లకు ప్రత్యామ్నాయం చూపాలి
- 15 లోపు సిఎండి నిర్ణయం తీసుకోవాలి: మురళి
ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): ఉన్నఫలంగా వందమంది బిల్ కలెక్టర్లను విధులకు దూరం చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే మానుకోవాలని, ఈ నెల15లోపు వీరందరికీ ఎపిఎస్‌ఫిడిసిఎల్ సిఎండి ప్రత్యామ్నాయం చూపాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలో వందమంది విద్యుత్తు బిల్ కలెక్టర్లు 35 సంవత్సరాలుగా ఎపిఎస్‌పిడిసిఎల్ సంస్థకు సేవలు అందిస్తున్నారన్నారు. వీరు ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా విధులు నిర్వహిస్తూ వచ్చారని, సొంత అవసరాలకు సైతం సెలవు పెట్టే వెసులుబాటు వీరికి లేదని పేర్కొన్నారు.
ఎపి ఎస్‌పిడిసిఎల్ పరిధిలో డిజిటల్ సేవలు ప్రజలకు అందించడంలో ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని, ఇన్నేళ్లుగా సంస్థ ప్రయోజనం కోసం శ్రమించిన తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని మాత్రమే వారు కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటలీకరణను ప్రోత్సహించడం హర్షించదగ్గ విషయమే అయినా, దానివల్ల నష్టపోయే ఉద్యోగులకు, కార్మికులకు, సంస్థని నమ్ముకుని విధులు నిర్వర్తించే శ్రామికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకపోవడం శోచనీయమని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సిఎండి విన్నవించాలని ఎన్నోసార్లు ప్రయత్నించామని, నేటికీ సమస్యలు వినడానికి ఇష్టపడకపోవడం బాధాకరమని తెలిపారు. విధుల్లో నుంచి తొలగించిన వారికి ఈ నెల 15లోపు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే 17న బిల్ కలెక్టర్ల కుటుంబ సభ్యులతో కలిసి ఎపిఎస్‌పిడిసిఎల్ కార్యాలయం ముందు నిరసన, నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరంచారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షులు పివి రమణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)