డోలీలో 4 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తరలింపు
ప్రజాశక్తి- అనంతగిరి (అల్లూరి జిల్లా) : పోడు వ్యవసాయ పనుల్లో భాగంగా కలుపు తీస్తుండగా మహిళను పాముకాటు వేసింది. అన్ని గ్రామాలకూ రహదారులు నిర్మించామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా... అక్కడ ఎటువంటి రహదారి సౌకర్యం లేదు. దీంతో, ఆమెను డోలీలో ఆసుప్రతికి తరలించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల కథనం ప్రకారం... అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీలోని మారుమూల గ్రామమైన కడరేవుకు చెందిన సోమెల రంభ గ్రామానికి సమీపంలో పోడు వ్యవసాయం కలుపు తీస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఎడమ కాలుపై పాము కాటు వేయడంతో పరిస్థితి విషమించింది. రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ గ్రామం నుండి నాలుగు కిలోమీటర్లు డోలీ సహాయంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం సమిద మెయిన్ రోడ్డు వరకు రంభను తరలించారు. అనంతరం అక్కడి నుండి ప్రైవేటు వాహనంలో ఎస్ కోట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.








కామెంట్‌లు (0)