న్యూఢిల్లీ : యుపిఐ చెల్లింపులపై ఛార్జీలు విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫోన్‌పే సిఇఒ సమీర్ నిగమ్ తెరదించారు. సాధారణ వినియోగదారులు యుపిఐ ద్వారా డబ్బు పంపేందుకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘భారతీయ వినియోగదారులందరికీ యుపిఐ ఉచితంగానే ఉంటుంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలో కొత్త పన్ను సవరణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో .... యుపిఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ మొదలైంది. దీంతో యుపిఐ వినియోగించే సామాన్యులపైనా ఛార్జీలు విధిస్తారా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎండిఆర్ విధించినా అది వ్యాపార సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) స్పష్టం చేసింది. చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యుపిఐ చెల్లింపులు స్వీకరించేందుకు ఎలాంటి ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఎండిఆర్ అంటే ....
డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులు పేమెంట్ సేవల సంస్థలకు చెల్లించే రుసుమును మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) అంటారు. కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార సంబంధిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా ఒకరి నుంచి మరొకరికి చేసే యూపీఐ చెల్లింపులకు ఈ రుసుము వర్తించదు.
కొత్త బిల్లు యుపిఐ వినియోగదారులపై నేరుగా ఎలాంటి ఛార్జీలను విధించడం లేదని పిసిఐ స్పష్టం చేసింది. దాదాపు పదేళ్లుగా బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కలిసి యుపిఐ వ్యవస్థ నిర్వహణ, సైబర్ భద్రత, మోసాల నివారణ తదితర ఖర్చులను భరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుపిఐ వ్యవస్థకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆర్థిక నమూనాను రూపొందించడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.








కామెంట్‌లు (0)