- మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసి గర్జన పేరుతో కుట్రలు చేసేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాలనలో బిసిలను మోసం చేసి ఇప్పుడు బిసి గర్జన ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.ప్రశ్నించిన పాపానికి వైసిపి నేతలు 74 మంది బిసిలను హత్య చేశారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో బీసీలపై జరిగిన దాడులకు స్పందించి ఒక్క బాధితుడిని కూడా జగన్ పరామర్శించలేదని పేర్కొన్నారు. రూ.75 వేల కోట్ల నిధులను దారి మళ్లించి 34 పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అక్రమాలు, అక్రమ మద్యం వ్యవహారాల వల్ల బలహీన వర్గాలు తలదించుకోవాల్సి వస్తోందని చెప్పారు.
27 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం: నీలాయపాలెం విజయ్‌కుమార్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేసేందుకు జూలై 27 నుంచి "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ఏం చేశాం? ఎన్ని హామీలు అమలు చేశాం? రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం? అనే విషయాలను నేరుగా ప్రజల వద్దకే వెళ్లి చెప్పే కార్యక్రమమే 'ఇంటింటికీ తెలుగుదేశం' అని తెలిపారు. తాము మాటలు చెప్పడం లేదని, చేసిన పనులే చెబుతున్నామని, అందుకే ధైర్యంగా ప్రతి ఇంటి గడప తొక్కుతున్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను వివరంగా తెలియజేస్తారని తెలిపారు.








కామెంట్‌లు (0)